బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను భయపెడుతున్నరు

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను భయపెడుతున్నరు

బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో విద్యార్థులను భయపెడుతున్నారని బీఎస్పీ (BSP) రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఘటనను బయటకు చెప్పవద్దని బలవంతం చేస్తున్నారని తమకు విద్యార్థులు చెప్పారన్నారు. ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థులను పరామర్శించడానికి ప్రవీణ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన V6తో మాట్లాడారు. క్యాంపస్ లోకి తల్లిదండ్రులను ఎందుకు అనుమతించడం లేదన్నారు. అంతా మంచిగా ఉంటే.. ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఉన్నత విద్యాలయాలను ప్రభుత్వం కబలించి వేయాలని చూస్తోందని, విద్యార్థులు చదువుకోవద్దనే ఒక భావన సీఎం కేసీఆర్ లో ఉందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్, కార్పొరేట్ కళాశాలల్లో ఇలాంటి ఘటనలు ఎందుకు జరగడం లేదని, పేద పిల్లలు చదువుకొనే స్కూళ్లపై నిర్లక్ష్యం వ్యవహరిస్తోందన్నారు. 

‘సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యేలు ఎందుకు నిలదీయడం లేదు. ఫుడ్ లో కప్పలు వస్తున్నాయని చెప్పడం సిల్లీనా ? వైస్ ఛైన్స్ లర్ లేడు చెప్పడం సిల్లీనా ? రూ. 20 కోట్లు బడ్జెట్ ఇచ్చి.. రిపేర్లు చేయాలని చెప్పడం సిల్లీనా ? విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. పుడ్ పెట్టిన కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి. ముఖ్యమంత్రి కొడుకు విదేశీ పర్యటనకు, వివిధ సంస్థలకు భారీ ఎత్తున నిధులు వెంటనే మంజూరు చేస్తారు. బాసర ట్రిపుల్ ఐటీలో మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రం నిధులు విడుదల చేయడం లేదు’ అంటూ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. 

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ కొనసాగుతోంది. రెండు క్యాంటీన్లపై కేసు నమోదు చేసిన అధికారులు వాటి టెండర్లు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ట్రిపుల్ ఐటీ సిబ్బంది తెలిపారు. నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి 9 మంది డిశ్చార్జి అవగా..మరో నలుగురు చికిత్స పొందుతున్నారు.