హాస్టల్​లో ఆహారం మంచిగ లేదన్న తల్లిదండ్రులు

హాస్టల్​లో ఆహారం మంచిగ లేదన్న తల్లిదండ్రులు

వరంగల్, పర్వతగిరి (సంగెం), వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీ సెకండియర్ స్టూడెంట్ శాబోతు సంజయ్ కిరణ్ (19) జీర్ణకోశ వ్యాధితో మరణించాడు. మృతుడి తల్లిదండ్రులు శ్రీలత, శ్రీధర్ కథనం మేరకు.. వరంగల్ ​జిల్లా సంగెం మండలం ఎల్గూర్​రంగంపేటకు చెందిన సంజయ్ నిరుడు బాసర ట్రిపుల్​ఐటీలో సీటు పొందాడు. హాస్టల్ లో ఫుడ్ మంచిగ లేదంటూ పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే క్రమంలో రెండు నెలలుగా జీర్ణకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో పేరెంట్స్ అతడిని హైదరాబాద్​లోని  ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో అడ్మిట్​ చేశారు. మందులు వాడుతున్న క్రమంలో సంజయ్ 15 రోజుల కింద అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వరంగల్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ తో పాటు ఎంజీఎంలో కూడా వైద్యం చేయించారు. ఎంజీఎంలో ట్రీట్ మెంట్​ పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు. కుటుంబ సభ్యులు సంజయ్ మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఎల్గూర్ రంగంపేటకు తరలించారు. 

పాంక్రియాస్​ సమస్యతో బాధపడుతున్నడు: ఆఫీసర్లు

సంజయ్​ కిరణ్​ పాంక్రియాస్​ సమస్యతో బాధపడుతున్నాడని బాసర ఆర్జీయూకేటీ వర్సిటీ ఆఫీసర్లు అన్నారు. దాని కారణంగానే ఆ విద్యార్థి అనారోగ్యం పాలై, గత నెల 20న క్యాంపస్​ నుంచి సొంతూరుకు వెళ్లాడని చెప్పారు. అందు కోసం అతని పేరెంట్స్ అనుమతితో సంజయ్​కు ఔట్​పాస్​ కూడా జారీ చేశామని తెలిపారు.

16 లక్షలు ఖర్చుపెట్టినా బతకలేదు

బాసర ట్రిపుల్​ఐటీలో స్టూడెంట్లకు పెట్టే ఆహారం సరిగా లేకపోవడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని సంజయ్​తల్లిదండ్రులు ఆరోపించారు. హాస్టల్​లో అన్నం, కూరలు బాగా లేవని తమ కుమారుడు తమకు తరచూ చెప్పేవాడని తెలిపారు. అంతకు ముందు ఇంటి వద్ద ఉన్నప్పుడు అతని ఆరోగ్యం బాగానే ఉందని,  రెండు నెలలుగా జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్నాడని చెప్పారు. ఇప్పటి వరకు హైదరాబాద్​లో రూ.16 లక్షల వరకు ఖర్చు పెట్టామని, అయినా తమ కొడుకును బతికించుకోలేకపోయామని కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకులాంటి పరిస్థితి ఇతర స్టూడెంట్లకు రాకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సంజయ్​మృతి వార్త తెలుసుకున్న ట్రిపుల్​ఐటీ విద్యార్థులు, ఆఫీసర్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతని ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇటీవలే వర్సిటీ హాస్టల్​లో కలుషిత ఆహారం కారణంగా చాలా మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమస్యల పరిష్కారం కోసం  ఆందోళనలు చేపట్టారు.