బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు టెన్త్ మార్కులతోనే

బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు టెన్త్ మార్కులతోనే
  • ఆర్జీయూకేటీ యూటర్న్​
  • పాలిసెట్ తో సీట్లు నింపుతామని గతంలో ప్రకటన
  • మళ్లీ పది మార్కులవైపే మొగ్గు
  • 3, 4 రోజుల్లో నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రాజీవ్‌‌‌‌‌‌‌‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌ (ఆర్​జీయూకేటీ - బాసర ట్రిపుల్ ఐటీ) అడ్మిషన్ల విధానం మారింది. పాలిసెట్ ద్వారా కాకుండా టెన్త్ మార్కులతోనే సీట్లు భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామనీ ఆర్జీయూకేటీ ప్రకటించింది. 3, 4 రోజుల్లోనే అడ్మిషన్ల నోటిఫికేషన్​రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గ్రామీణ ప్రాంత  పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు 2008లో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా టెన్త్ మార్కులతోనే సీట్లు అలాట్ చేశారు. అయితే కోవిడ్ ఎఫెక్ట్​తో 2020,  2021 సంవత్సరాల్లో   టెన్త్ పరీక్షలు జరగలేదు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వడంతో లక్షల మంది స్టూడెంట్స్​కు 10 జీపీఏ వచ్చాయి.

2020లో 1,41,383 మందికి 10 జీపీఏ రావడంతో వారికి సీట్లు కేటాయించడం ఆర్జీయూకేటీ అధికారులకు ఇబ్బందిగా మారింది. 2021లో 2,10,647 మందికి10 జీపీఏ వచ్చాయి. దీంతో అడ్మిషన్ల ప్రాసెస్ ఆలస్యం కావొద్దనే ఆలోచనతో పాలిసెట్ ద్వారా అడ్మిషన్లు చేపట్టారు. దీని ప్రభావం పేద పిల్లలపై బాగా పడింది. ఆర్జీయూకేటీలో  మొత్తం1500 సీట్లుంటే, సర్కార్​స్కూల్ పిల్లలకు కేవలం 200 వరకు మాత్రమే సీట్లు దక్కాయి. మిగిలిన సీట్లన్నీ ప్రైవేటు స్కూల్ స్టూడెంట్లకే వచ్చాయి. అయితే ఏటా సర్కారు స్కూళ్ల స్టూడెంట్లే 95శాతానికి పైగా సీట్లు పొందేవారు. కానీ పాలిసెట్ ద్వారా ఇది రివర్స్ కావడంతో పేరెంట్స్ ఆందోళన చెందారు. ఇదే విషయాన్ని ఏప్రిల్​ నెలాఖరులో  ‘పేద విద్యార్థులపై ఎంట్రెన్స్ పిడుగు’ శీర్షికతో ‘వెలుగు’లో కథనం కూడా ప్రచురితమైంది. దీంతో సర్కారు పెద్దలు స్పందించి, ఈవిధానంపై చర్చలు మొదలుపెట్టారు. 

మళ్లీ ఫీజు కట్టాలా..? 

పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ మేలో ప్రారంభమైంది. ఫైన్ తో బుధవారం గడువు ముగిసింది. ఈ టైమ్ లో  టెన్త్ మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు ఉంటాయనే ఆర్జీయూకేటీ  ఏఓ  ప్రకటన రిలీజ్ చేశారు. అయితే పాలిసెట్​కు లక్షకు పైగా అప్లికేషన్లు రాగా.. అందులో బాసర ట్రిపుల్​ఐటీనే ఎక్కువ మంది ఎంచుకున్నారు. పాలిసెట్​కోసం ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఓసీ, బీసీలకు రూ.450 ఫీజు చెల్లించారు. తాజాగా  ఆర్జీయూకేటీ  నోటిఫికేషన్ వస్తే.. అక్కడా ఫీజు కట్టాల్సి వస్తుందని పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. ఆర్జీయూకేటీలో చేరేవారంతా పేద విద్యార్థులేననీ, ఫీజును తగ్గించాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.