
- తేల్చి చెప్పిన బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్..రెండోరోజూ నిరసనలు
- సీఎం కేసీఆర్ రావాలని నినాదాలు
- పోలీసుల నిర్బంధంలో క్యాంపస్.. విద్యార్థుల తల్లిదండ్రుల అడ్డగింత
- కలెక్టర్‌తో చర్చలు విఫలం..అర్ధరాత్రి వర్షంలోనూ ఆందోళన
నిర్మల్ / బాసర, వెలుగు: తమ డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించబోమని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లు స్పష్టం చేశారు. గతంలో తాము ఆందోళనలు చేసినప్పుడు కూడా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా.. తర్వాత సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని చెప్పారు. సీఎం కేసీఆరే స్వయంగా రావాలంటూ నినాదాలు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతల మధ్య రెండో రోజుకు చేరింది. మంగళవారం అకడమిక్ బ్లాక్ ఎదుట ఆందోళన చేపట్టిన స్టూడెంట్లు.. బుధవారం ప్రధాన గేటు ఎదుట ప్లకార్డులను పట్టుకొని బైఠాయించారు. క్యాంపస్ మొత్తం రెండు రోజులుగా పోలీసుల నిర్బంధంలో ఉంది. క్యాంపస్‌కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. ఊర్ల నుంచి వచ్చిన పేరెంట్స్‌ను స్థానిక రైల్వే స్టేషన్ దాటి రానివ్వలేదు.
కలెక్టర్ బెదిరించారు: స్టూడెంట్లు
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే.. ట్రిపుల్ ఐటీకి చేరుకుని ముగ్గురు స్టూడెంట్స్ గవర్నింగ్ బాడీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వెంటనే రూ.10 లక్షలను విడుదల చేసి మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని కలెక్టర్ వారికి నచ్చజెప్పారు. అయితే తమకు సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చే దాకా ఆందోళన విరమించబోమని, తమ 12 డిమాండ్లు పరిష్కరించాలని విద్యార్థులు స్పష్టం చేశారు. చర్చల తర్వాత మాట్లాడిన స్టూడెంట్స్ గవర్నింగ్ బాడీ బాధ్యులు మాదేశ్, లావణ్య, ప్రశాంత్.. ఆందోళన విరమించాలంటూ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ తమపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. తాము శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే సహకరించాల్సిన అధికారులు ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆందోళన విరమించకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని పరోక్షంగా హెచ్చరించారని చెప్పారు.
తల్లిదండ్రులను అడ్డుకున్న పోలీసులు
ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో బాసరకు తరలివచ్చారు. పోలీసులు వారిని రైల్వే స్టేషన్‌లోనే అడ్డుకున్నారు. వేరే దారిలో ట్రిబుల్ ఐటీకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకొని రైల్వే స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును పేరెంట్స్ ఖండించారు. తమ పిల్లలను కలుసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ విమర్శించారు. విద్యార్థుల ఆందోళనకు బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.