ట్రిపుల్ ఐటీ విద్యార్థుల గోడు తీరేనా?

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల గోడు తీరేనా?

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రిపుల్ ఐటీ అధికారులు... విద్యార్థుల హాస్టళ్లకు మంచి నీళ్ల సరఫరా బంద్ చేశారు. అధికారుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన విద్యార్థులు.. ఖాళీ నీళ్ల బాటిళ్లు చేతపట్టి,  ‘వీ వాంట్ వాటర్’ అంటూ నినాదాలు చేశారు. అడుగడుగునా పోలీసులు, అధికారులు ఆంక్షలు పెట్టడంపై వారు మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు విద్యార్థులకు మద్దతుగా వచ్చిన తల్లిదండ్రులను కూడా బలవంతంగా బాసర పీఎస్ కు తరలించారు. ఈక్రమంలో పోలీసులు, పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. వివిధ పార్టీల నేతల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి.. విద్యార్థులెవరూ ట్రిపుల్ ఐటీ మెయిన్ గేటు దగ్గరకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల నిర్బంధంపై రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల ఆందోళనపై మంత్రి సబిత, కలెక్టర్ ముషారఫ్ అలీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు నిర్మల్ కలెక్టరేట్ ను ముట్టడించారు.  మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ దిష్టి బొమ్మల్ని దహనం చేసే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఎందుకీ ఆందోళన  అంటే.. ?

బాసర ట్రిపుల్ ఐటీలో ఎంతోమంది పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న దాదాపు 8వేల మంది విద్యార్థులు నిత్యం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 8 ఏళ్లుగా.. వైస్ ఛాన్సలర్ పోస్టు ఖాళీగానే ఉంది. డైరెక్టర్, ఫైనాన్స్ ఆఫీసర్, రిజిస్ట్రార్ పోస్టుల భర్తీ చేయలేదు. వర్సిటీ మొత్తాన్ని ఓ కిందిస్థాయి రిటైర్డ్ అధికారికి అప్పగించారని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇన్ చార్జి వీసీలుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు హైదరాబాద్​ లో ఉంటూ వర్సిటీకి రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. బోధనా సిబ్బంది తగిన సంఖ్యలో లేక పాఠ్యాంశాలు సకాలంలో పూర్తి కావడం లేదని.. 146 సాంక్షన్డ్ టీచింగ్ పోస్టులుండగా, వారిలో19 మంది మాత్రమే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరిలోనూ కొందరు లాంగ్ లీవ్ లో ఉండటంతో ప్రస్తుతం 14 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగిలిన వారంతా కాంట్రాక్టు ఉద్యోగులే.  నాణ్యత లేని భోజనం, తాగునీటి సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి గతంలో ల్యాప్ టాప్, 2 జతల యూనిఫామ్స్, స్పోర్ట్స్ డ్రెస్, షూస్ అందించేవారు. కానీ 2019–20 నుంచి వాటిని కూడా ఇవ్వడం లేదు.  మూడేండ్ల కింద 100 ఏసీలు కొని తరగతి గదుల్లో, హాస్టళ్లలో  బిగించినా, వాటికి ఇంకా కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నిరసనకు దిగారు.