హైకోర్టులో పిల్‌ వేసే యోచనలో ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ !

హైకోర్టులో పిల్‌ వేసే యోచనలో ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ !

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఉద్యమ పంథాను మార్చనున్నారు. తమ సమస్యలపై విద్యార్థులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. హైకోర్టులో పిల్‌ దాఖలు చేసే యోచనలో స్టూడెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.సెలవుల ప్రకటనతో ప్రత్యక్ష ఉద్యమానికి బదులు న్యాయపోరాటం చేయాలని విద్యార్థులు భావిస్తున్నారు. సెలవులు ప్రకటించి ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని కాలేజీ యాజమాన్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు విద్యార్థుల సెల్ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ఇంచార్జ్ వీసీ సర్క్యులర్ జారీ చేశారు. ఇకపై క్లాస్ రూమ్స్, ల్యాబ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థులు సెల్ఫోన్ వాడొద్దని స్పష్టం చేశారు. విద్యార్థి ఉద్యమాన్ని, డిమాండ్లను అధికారులు కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యార్థుల పేరెంట్స్ తో 5 గంటల పాటు ఇంచార్జ్ వీసీ, అధికారులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. చర్చల పేరుతో సెల్ ఫోన్లు లాక్కొని, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టలేదని పేరెంట్స్ ఆరోపించారు. విద్యార్థుల 12 డిమాండ్లలో రెండంటే రెండే నెరవేర్చారని తెలిపారు. సెలవులు ప్రకటించడంతో వానలోనే ఇళ్లకు వెళ్లిపోతున్నారు E3 స్టూడెంట్స్. సెలవుల తర్వాత తిరిగి వచ్చే విద్యార్థులతో బాండ్లు రాయించుకునే యోచనలో ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై ఎలాంటి ధర్నాలు, నిరసనలు చేపట్టబోమని హామీ పత్రం రాయించే యోచనలో అధికారులున్నారని సమాచారం.