హర్యానాలో రెండు రోజుల్లో రెండు దుర్ఘటనలు
చండీగఢ్: హర్యానాలో రెండు రోజుల వ్యవధిలో బ్యాస్కెట్‌బాల్ కోర్టుల్లో ప్రమాదాలు జరిగి ఇద్దరు యువ బ్యాస్కెట్‌బాల్ ఆటగాళ్లు మృతిచెందారు. తుప్పు పట్టిన హోప్ పోల్ కుప్పకూలి మీదపడటంతో ఈ దుర్ఘటనలు జరిగాయి.
మంగళవారం ఉదయం రోహ్‌తక్ జిల్లా లఖన్ మజ్రా గ్రామంలో జాతీయ స్థాయి సబ్‌జూనియర్ ఆటగాడు హర్దీక్ రాఠీ(16) ప్రాక్టీస్ చేస్తూ హోప్‌ను పట్టుకోగానే పోల్ కుప్పకూలి మీదపడింది.
ఛాతీపై బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ రాఠీ ప్రాణాలుదక్కలేదు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. ఇదేవిధంగా ఆదివారం ఝజ్జర్ జిల్లా 15 ఏళ్ల అమన్ ప్రభుత్వ స్కూలు ఆవరణలో ప్రాక్టీస్ చేస్తుండగా పోల్ విరిగిపడడంతో మృతి చెందారు.
