ట్రిపుల్‌‌ ఐటీ స్టూడెంట్స్​తో చర్చలపై సందిగ్ధత

ట్రిపుల్‌‌ ఐటీ స్టూడెంట్స్​తో చర్చలపై సందిగ్ధత
  • సఫలమయ్యాయన్న మంత్రి ఇంద్రకరణ్‌‌రెడ్డి 
  • మంత్రితో చర్చలు సక్సెస్‌‌ కాలేదన్న స్టూడెంట్స్​
  • సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వాలంటూ డిమాండ్​
  • ఆందోళనలు కొనసాగిస్తామంటూ ప్రకటన

భైంసా / బాసర, వెలుగు: బాసర ట్రిపుల్‌‌ ఐటీ స్టూడెంట్లతో ప్రభుత్వ చర్చలపై సందిగ్ధత నెలకొంది. శనివారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్‌‌ చైర్మన్ వెంకటరమణ, కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్‌‌‌‌ విద్యార్థులతో చర్చించారు. అనంతరం చర్చలు సఫలమయ్యాయని మంత్రి ప్రకటించగా.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేదాకా ఆందోళన ఆగదని స్టూడెంట్స్‌‌ స్పష్టం చేశారు. ఉదయం ఉన్నత విద్యా మండలి వైస్‌‌ చైర్మన్ వెంకటరమణ స్టూడెంట్స్‌‌తో చర్చించి.. ఆందోళన విరమించాలని కోరగా వారు నిరాకరించారు. 

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌​ వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సాయంత్రం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి క్యాంపస్‌‌‌‌కు వచ్చారు. విద్యార్థులతో దాదాపు 2 గంటలకుపైగా చర్చలు జరిపారు. విద్యార్థుల అన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా సంతృప్తి చెందలేదు. 2008లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైనప్పుడు ఉన్న అన్ని సౌలతులను కల్పించాలని, ఏపీలో ఉన్న రెండు ట్రిపుల్ ఐటీల్లో లేని సమస్యలు ఇక్కడ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. దీంతో స్టూడెంట్స్‌‌‌‌కు మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, వారు వినలేదు. 

మంత్రి ప్రకటనతో స్టూడెంట్ల ఆగ్రహం

విద్యార్థులతో జరిగిన చర్చలు సక్సెస్‌‌‌‌ అయ్యాయని, వారి 12 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులతో చర్చల తర్వాత ఆయన బాసర రెవెన్యూ గెస్ట్ హౌస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. స్టూడెంట్ల డిమాండ్లపై మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి ప్రకటన చేస్తారని తెలిపారు. సోమవారం నుంచి విద్యార్థులు తరగతులకు హాజరవుతారని వెల్లడించారు. కాగా, మంత్రి ప్రకటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రితో జరిగిన చర్చల్లో తాము ఈ విషయానికి అంగీకారం తెలపలేదన్నారు. 5 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా.. సీఎం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే దాకా ఆందోళనలు కొనసాగుతాయని స్టూడెంట్లు స్పష్టం చేశారు. అలాగే క్యాంపస్‌‌‌‌కు సెలవులు ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందన్నారు.కాగా, క్యాంపస్‌‌‌‌లో ఐదు రోజులుగా ఆందోళనలు చేస్తున్న స్టూడెంట్స్‌‌‌‌లో పలువురు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో శనివారం కొంత మంది ఇంటిబాట పట్టారు. 

ట్రిపుల్ ఐటీ ఏవో తొలగింపు

ట్రిపుల్ ఐటీ ఏవోగా చాలాకాలం నుంచి పనిచేస్తున్న రాజేశ్వర్ రావును ఆ విధుల నుంచి తప్పిస్తూ ఇన్‌‌‌‌చార్జి వైస్‌‌‌‌ చాన్సలర్ రాహుల్ బొజ్జా శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు చేస్తున్న 12 డిమాండ్లలో ఏవోను తొలగించాలన్న డిమాండ్ కూడా ఉంది. 

సమస్యలు పరిష్కరిస్తం: సబితా రెడ్డి హామీ 

బాసర ట్రిపుల్‌‌‌‌ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇస్తున్నా అని స్టూడెంట్లకు మంత్రి లేఖ రాశారు. 

మాట వినండి.. లేకపోతే తిండి పెట్టం క్యాంపస్‌‌‌‌ క్యాంటీన్ హెచ్‌‌‌‌వోడీ బెదిరింపులు

‘‘ఎన్ని రోజులు ఆందోళనలు చేస్తారో చేయండి. పెద్దలు చెబుతున్నారు వింటే వినండి. లేకుంటే తిండి పెట్టడం ఆపేస్తం. అప్పుడుగాని దారికి రారు’’అంటూ ట్రిపుల్ ఐటీలోని క్యాంటీన్‌‌‌‌ హెచ్‌‌‌‌వోడీ శాస్త్రి స్టూడెంట్లను​బెదిరించారు. డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సతీశ్‌‌‌‌ అండగా ఉంటామంటే బుర్రకు ఎక్కడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీకు బండి సంజయ్, రేవంత్‌‌‌‌ రెడ్డి, ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సపోర్టు ఉందేమో. అందుకే ఎవరి మాట వినడం లేదు’’అంటూ మండిపడ్డారు.