ఆఫీసర్ల హామీ.. ధర్నా విరమించిన బస్వాపూర్ నిర్వాసితులు

ఆఫీసర్ల హామీ.. ధర్నా విరమించిన బస్వాపూర్ నిర్వాసితులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పనాయక్ తండా గ్రామస్తులు బస్వాపూర్ రిజర్వాయర్ కట్టపై 13 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షలను బుధవారం విరమించారు. నెల రోజులలోపు నిర్వాసితుల డిమాండ్లను నెరవేరుస్తామని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించినట్లు లప్పనాయక్ తండా సర్పంచ్ ధీరావత్ బుజ్జి శంకర్ నాయక్ చెప్పారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో లప్పనాయక్ తండా గ్రామం ముంపునకు గురవుతోంది. పునరావాసం కోసం ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఉత్తర్వులు జారీ చేసి ఏడాది గడుస్తున్నా అమలు చేయలేదు. దీంతో పరిహారం కోసం 13 రోజులుగా రిజర్వాయర్ కట్టపై లప్పనాయక్ తండా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.

ధర్నా ప్లేస్ కు బుధవారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఆఫీసర్లు వచ్చి చర్చలు జరిపారు. ప్రభుత్వం మొదట హామీ ఇచ్చిన ప్రకారం.. సరిగ్గా నెల లోపు దాతరుపల్లి సర్వే నంబర్ 294లో బీటీ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో లేఅవుట్ చేసి ఇండ్ల స్థలాలు ఇస్తామని అడిషనల్ కలెక్టర్ ప్రకటించారు. అలాగే 206 ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా తొందరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. పునరావాసం కింద వచ్చే అమౌంట్ కూడా మొత్తం ఒకేసారి నిర్వాసితులకు అందేలా ప్రభుత్వంతో చర్చలు జరిపి అమలు చేస్తామన్నారు. వెంటనే ధర్నా విరమిస్తే హామీలకు సంబంధించిన ప్రాసెస్ ను ప్రారంభిస్తామని ఆఫీసర్లు చెప్పడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. నెలలోపు హామీలు నెరవేర్చకపోతే మళ్లీ దీక్షలు చేస్తామని హెచ్చరించారు.