
ప్రతి ఒక్కరు చిన్నదైనా సొంతిల్లు ఉండాలనుకుంటారు. కొద్దిపాటి స్థలంలో ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు ప్లేస్ ఎడ్జెస్ట్మెంట్ లో భాగంగా సెప్టిక్ ట్యాంక్ పైన మరుగుదొడ్డి కట్టుకుంటారు. అలా ఉండే వాస్తు ప్రకారం ఏమైన దోషమా.. మరికొంతమంది ఖాళీ స్థలం కొనుక్కుంటారు.. తరువాత ఇల్లు కట్టుకుంటారు.. ఖాళీ స్థలం కొనేటప్పుడు .. ఆ స్థలంలో ఇల్లు కట్టుకొనేటప్పుడు వాస్తు ప్రకారం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
ప్రశ్న: సెప్టిక్ ట్యాంకు కూడా వాస్తు వర్తిస్తుందా? అలా అయితే ఎక్కడుంటే మంచిది? మా ఇంట్లో వాయువ్యం మూల ఉన్న అటాచ్డ్ లెట్రిన్, బాత్రూమ్ కింద సెప్టిక్ ట్యాంక్ ఉంది. డ్రైనేజీ పైపులు వచ్చాక ఆ సెప్టిక్ ట్యాంకిని వాడట్లేదు. ఆ డ్రైనేజ్ నీళ్లు వాయువ్యం మూల పదమర వైపుకు బయటికి వెళ్తున్నాయి. అది మంచిచేనా? అలాగే ఇప్పుడు వాడకం లేనిసెప్టిక్ వల్ల ఏమైనా చెడు ప్రభావం ఉంటుందా?
సమాధానం : అన్నింటిలాగే సెప్టిక్ ట్యాంకు కూడా వాస్తు కచ్చితంగా వర్తిస్తుంది. అలాగే ఇల్లు అయినా, బాత్రూమైనా నైరుతిమూల తప్ప మిగతా చోట్ల నుంచి నీళ్లు బయటికి వెళ్లొచ్చు. సెప్టిక్ ట్యాంకు మీద లెట్రిన్, బాత్రూమ్ నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. కాకపోతే బాత్రూమ్ కట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని కచ్చితంగా ఉత్తరం, తూర్పు గోడలకు తగలకుండా చూసుకో వాలి, మిగిలిన పడమర, దక్షిణ గోడలకు ఆనించి కట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మీరు ఎలాగూ సెప్టిక్ ట్యాంకును వాడలేదు. అలాగే, డ్రైనేజీ నీళ్లు వాయువ్యం గుండా పడమర దిక్కుకు వెళ్తున్నాయి కాబట్టి ఎలాంటి దోషాలూ ఉండవు.
ప్రశ్న: ప్రస్తుతం మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత రెండేళ్లుగా ప్లాట్ కొనాలని చూస్తున్నాం. ఏదీ కలిసి రాలేదు. కానీ ఈ మధ్య ఒక దగ్గర రెండొందల గజాల స్థలం చూశాం. ఇంట్లో వాళ్లందరికీ బాగా వచ్చింది. కాకపోతే స్థలం చతురస్రాకారంలోనే ఉన్నా గ్రౌండ్ లెవల్ సమానంగా లేదు. కొందరేమో పర్వాలేదు తీసుకోవచ్చు అంటున్నారు. మరికొందరేమో ఆలా ఉంటే మంచిది కాదు. వాస్తు దోషాలు ఉంటాయంటున్నారు.మమ్మల్ని ఇప్పుడు స్థలం కొనమంటారా? వద్దా?
సమాధానం: మీరు కొనాలనుకుంటున్న స్థలం చతురస్రాకారంలో ఉందన్నారు. అది మంచిదే కానీ ఎత్తు వంపులు లేకుండా ఉంటేనే మేలు, ఒకవేళ ఖాళీ స్థలంలో ఉన్నా, ఇల్లు కట్టేటప్పుడు మాత్రం సమానం చేసుకోవాలి. అది సమానం చేయలేనిదైతే ఏ వైపుకు ఎత్తు ఏ వైపుకు వాలు ఉండాలో చూను కోవాలి. వాలు ఎప్పుడైనా పడమర నుంచి తూర్పుకు, దక్షిణం నుంచి ఉత్త రానికి ఉండాలి. అలాకాకుండా తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి ఉంటే చెడు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాగే కొండలు, గుట్టల మీద ఇల్లు కట్టుకోకపోవడమే మంచిది.