
- తొలిరోజు వెయ్యి స్తంభాల గుడిలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు
- అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర సర్కారు
- హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, జూపల్లి, సురేఖ, సీతక్క
- బతుకమ్మ ఆడి ఆడబిడ్డల్లో ఉత్సాహం నింపిన కొండా సురేఖ, సీతక్క
- రాష్ట్రవ్యాప్తంగా పూల పండుగ ప్రారంభం
వరంగల్/హనుమకొండ, వెలుగు: బతుకమ్మ పాటలు.. ఆడబిడ్డల ఆటలతో తెలంగాణ మార్మోగింది. ఆదివారం ఓరుగల్లు కేంద్రంగా హనుమకొండ వెయ్యిస్తంభాల గుడిలో ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను అధికారికంగా ప్రారంభించింది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, జూపల్లి కృష్టారావు, కొండా సురేఖ, ధనసరి సీతక్క హాజరయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు.
స్థానిక మహిళలతో కలిసి మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి బతుకమ్మ ఆడి, ఉత్సాహాన్ని నింపారు. స్టేజీపై మంత్రులు సురేఖ, సీతక్క.. ‘‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దూలగుమ్మా’’ అంటూ బతుకమ్మ పాటలు పాడి అలరించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తొలిరోజు ఆడబిడ్డలు బతుకమ్మ పాటలకు పాదం కలపగా.. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పూల పండుగ సందడి నెలకొన్నది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి సందమామ.. పాటలతో వీధులన్నీ మార్మోగాయి.
అమ్మవారి స్వరూపంగా మహిళలు ఎదగాలి: భట్టి
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టూరిజం, సాంస్కృతిక శాఖ తరఫున బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా, సంపద కలిగేలా అమ్మవారు కరుణించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మహిళలందరూ అమ్మవారి స్వరూపంగా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అన్నారు. బతుకమ్మ వేడుకలు అంతర్జాతీయస్థాయికి విస్తరించాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్టారావు పేర్కొన్నారు. వెయ్యిస్తంభాల గుడిలో వేడుకలు నిర్వహించుకోవడం అద్భుతమైన సన్నివేశమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ వేడుకలను విశ్వవ్యాప్తం చేసేలా సంబురాలకు శ్రీకారం చుట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
వెయ్యి స్తంభాల గుడి కేంద్రంగా టూరిజం శాఖ తరఫున వేడుకలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, టూరిజం శాఖ మంత్రి జూపల్లికి మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజుల స్ఫూర్తితో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటూనే చెరువులు, ప్రకృతిని కాపాడుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బతుకమ్మలో అన్నిరకాల పూలు ఉన్నట్లుగానే.. మామునూర్ ఎయిర్‍పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లతో వరంగల్ సిటీ రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్నదని ఎంపీ కడియం కావ్య అన్నారు. మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి మాట్లాడారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, హనుమకొండ కలె క్టర్ స్నేహ శబరీష్, సీపీ సన్‍ప్రీత్‍సింగ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్ పాల్గొన్నారు.
కాళోజీ కళాక్షేత్రంలో నాటకోత్సవాలు ప్రారంభం
హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, జూపల్లి, కొండా సురేఖ, సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ ఆచార్య ఆలేఖ్య పుంజాల బృందం ప్రదర్శించిన చాకలి ఐలమ్మ నాటకం అందరినీ ఆకట్టుకున్నది. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సాధారణ మహిళగా చాకలి ఐలమ్మ జమీందార్లపై చేసిన పోరాటం.. నేటితరం యువతకు ఆదర్శం కావాలన్నారు. ఆలేఖ్య బృందాన్ని ఘనంగా సన్మానించారు.