ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
  • వేయిస్తంభాల గుడి వద్ద ఉత్సాహంగా సంబురాలు 

వెలుగు, నెట్​వర్క్​: పూలపండుగ బతుకమ్మ సంబురాలు ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రేటర్​వరంగల్​తోపాటు అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు స్టార్టయ్యాయి. బతుకమ్మ ఉత్సవాలకు ఫేమస్‍ అయిన ఓరుగల్లులో ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు ఉత్సహంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..అంటూ మహిళలు, చిన్నారులు ఆడిపాడారు. యువతులు, చిన్నారులు సైతం పాల్గొన్నారు. గ్రేటర్ పరిధి హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు వేలాది మంది తరలివచ్చారు. గ్రేటర్ కార్పొరేషన్‍, ఆలయం తరఫున లైటింగ్‍, సౌండ్‍ సిస్టం ఏర్పాటు చేశారు.

తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
రాయపర్తిలో 8వ జోనల్​ స్థాయి క్రీడలను ప్రారంభించిన 
మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు 


రాయపర్తి, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల స్కూళ్లు దేశానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. వరంగల్​ జిల్లా రాయపర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్​లో ఆదివారం 8వ జోనల్​ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు వరంగల్​, హన్మకొండ, మహబూబాబాద్​ గురుకులాల నుంచి 1500 క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.

అనంతరం విద్యార్థుల ఆటపాటలు తిలకించారు. కార్యక్రమంలో జాయింట్​ కలెక్టర్​ హరిసింగ్​, ఆర్​సీఓ విద్యారాణి, స్థానిక ప్రిన్సిపాల్​ ఉమామహేశ్వర్​, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి,  జడ్పీటీసీ రంగు కుమార్​, టీఆర్​ఎస్​ మండల అధ్యక్షుడు మునావత్​ నరసింహానాయక్​,  రైతుబంధు మండల కోఆర్డినేటర్​ ఆకుల సురేందర్​రావు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నాన్నా.. సివిల్​ సర్వెంట్ ​అయ్యాకే తిరిగి వస్తా

లెటర్ రాసి విద్యార్థిని అదృశ్యం

హసన్ పర్తి, వెలుగు : సివిల్ సర్వెంట్ అయ్యాకే తిరిగి వస్తానని ఓ విద్యార్థి లెటర్ రాసి అదృశ్యమైంది. కేయూ సీఐ దయాకర్ వివరాల ప్రకారం.. పలివేల్పుల గ్రామంలోని దుర్గా కాలనీలో ఓ యువతి(18) ఇంటర్ కంప్లీట్ చేసింది. సివిల్​సర్వెంట్​కావాలని అనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పగా అది చాలా కష్టంతో కూడుకున్నదని, ఇతర చదువులపై దృష్టి పెట్టాలని సూచించారు. దీంతో కలత చెందిన ఆమె ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తాను సివిల్​సర్వెంట్​అయ్యాకే తిరిగి వస్తానని ఆ యువతి రాసిన లెటర్ ​ఇంట్లో దొరికింది. 
తండ్రి కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

‘సఫాయి’ స్కాంలో గ్రేటర్​ప్రజాప్రతినిధులకు వాటా 

డీసీసీ అధ్యక్షుడు నాయిని 

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్​లో ఔట్‍సోర్సింగ్‍ శానిటరీ ఉద్యోగుల ఎంపికలో స్కాం జరిగిందని.. విజిలెన్స్, సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని కాంగ్రెస్‍ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‍ చేశారు. బాధిత సఫాయి కార్మికులు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో కలిసి ఆయన ఆదివారం హనుమకొండ కాంగ్రెస్‍ భవన్​లో ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బల్దియాలో 452 శానిటరీ వర్కర్స్​పోస్టుల భర్తీలో గ్రేటర్‍ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‍భాస్కర్‍, నన్నపునేని నరేందర్‍,  మాజీ, ప్రస్తుత మేయర్లు గుండా ప్రకాశ్‍, గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు,  గత ఎంహెచ్‍ఓ రాజారెడ్డి, పక్క జిల్లాల మంత్రులకు సైతం వాటాలున్నాయని ఆరోపించారు.

పోస్టుల్లో ఎమ్మెల్యేలు, మినిస్టర్ల వాటాల సంఖ్య, సిఫారుసులపై.. అధికారులు, కాంట్రాక్టర్, లీడర్లు మాట్లాడుకున్న ఆడియోలు మీడియాకు వినిపించారు. బాధితులు ఇచ్చిన డబ్బులకు సంబంధించి అగ్రిమెంట్‍ పేపర్లు చూపారు. కాంట్రాక్టర్‍ ఆదినారాయణ, ఎంహెచ్‍ఓ రాజారెడ్డిని అడ్డంపెట్టుకొని సఫాయి కార్మికుల వద్ద లంచాలు వసూలు చేశారన్నారు. అడిగిన లంచం ఇవ్వలేదనే కారణంతో బెస్ట్​వర్కర్లుగా ప్రశంసా పత్రాలు పొందినవారిని సైతం పక్కనపెట్టారని మండిపడ్డారు.

కార్మికులకు సంబంధించి రూ.2 కోట్ల పీఎఫ్, ఇన్సూరెన్స్​డబ్బులతో కాంట్రాక్టర్‍ జంప్‍ అయ్యాడని చెప్పారు. దొంగ సంతకాలతో ఉద్యోగుల సెలక్షన్‍ జాబితాను ఎప్పటికప్పుడు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల హర్టికల్చర్‍ డిపార్టుమెంట్లో అవినీతి బయటపడితే.. ఓ ఎమ్మెల్యే సదరు ఆఫీసర్​ను సేఫ్‍ జోన్‍లో ఉండేలా సహకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే కార్పొరేషన్‍ ముట్టస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ దళితుల కోసం ఎంతో చేస్తున్నానని మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‍, మంత్రి కేటీఆర్‍కు పేద దళితుల వద్ద లంచాల దందా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జనాల బాగుకోరుతూ.. రోడ్లు ఊడ్చి, మోరీలు సాఫ్ చేస్తున్న పేద దళిత బిడ్డల దగ్గర.. టీఆర్‍ఎస్‍ లీడర్లు లంచాలు తీసుకోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు. 

గుజ్జుల కుటుంబానికి దత్తాత్రేయ సంతాపం 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఈటల రాజేందర్

హనుమకొండసిటీ, వెలుగు: ప్రముఖ విద్యావేత్త, ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు గుజ్జుల నర్సయ్య కుటుంబాన్ని హర్యానా గవర్నర్​బండారు దత్తాత్రేయ ఫోన్​లో పరామర్శించి సంతాపం తెలిపారు. ఏబీవీపీకి నర్సయ్య అండగా నిలిచి విద్యార్థి ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం రాత్రి గుజ్జుల కుటుంబాన్ని పరామర్శించారు. హనుమకొండ జిల్లా హంటర్ రోడ్ లోని నర్సయ్య ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఉన్నారు. నర్సయ్య అంత్యక్రియలు హనుమకొండ పద్మాక్షి వైకుంఠధామంలో సోమవారం ఉదయం  జరుగుతాయని  వారి కుటుంబసభ్యులు తెలిపారు.

సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్

ప్రోటోకాల్ పాటించలేదని దంతాలపల్లి సర్పంచ్ ఆవేదన

నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్​అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మీటింగ్ లో ఆఫీసర్లు ప్రోటోకాల్ పాటించలేదని దళిత మహిళ సర్పంచ్​నని చిన్నచూపు చూస్తున్నారని దంతాలపల్లి సర్పంచ్ దర్శనాలు సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మీటింగ్ లో విలేకరులకు కుర్చీలు వేయకపోవడంతో నేలపైనే కూర్చున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ ఉమ, పీఏసీఎస్ చైర్మన్ రాము పాల్గొన్నారు.

ఆడబిడ్డల కోసమే బతుకమ్మ చీరలు

చిట్యాల, స్టేషన్​ఘన్​పూర్: తెలంగాణ ఆడపడుచులు సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోందని  ఎంపీపీ  దావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్​, పీఏసీఎస్​ చైర్మన్​ కుంభం క్రాంతికుమార్​రెడ్డి తెలిపారు. చిట్యాల మండలం నైన్​పాక, వరికోల్​పల్లి, చైన్​పాక, అందుకుతండా, వెంచరామి గ్రామాల్లో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. పీఏసీఎస్​ వైస్​చైర్మన్​ గణపతి, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్​ లీడర్లు పాల్గొన్నారు. స్టేషన్​ఘన్​పూర్​మండలం తాటికొండలో వైస్​ఎంపీపీ సుధీర్​రెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

భార్యను చంపిన కేసులో భర్త అరెస్ట్

మహబూబాబాద్​అర్బన్​, వెలుగు: భార్యను హత్య చేసిన కేసులో భర్తను అరెస్టు చేసి రిమాండ్​ చేసినట్లు మహబూబాబాద్​టౌన్​ సీఐ సతీశ్​ తెలిపారు. టౌన్​పరిధిలోని భవానీ నగర్ తండాకు చెందిన జాటోత్ భాస్కర్ కల్పన(30)ను 15ఏండ్ల కింద  ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.  కల్పన ఇండ్లలో పనులు చేసేది, భాస్కర్ మటన్ షాపులో పనిచేసేవాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. భాస్కర్ తాగుడుకు అలవాటు పడి పనికి పోకుండా డబ్బుల కోసం భార్యను ఇబ్బంది పెట్టేవాడు.  ఇటీవల ఆమెను కొట్టడంతో పుట్టింటికి వెళ్లింది.  తనను కాదని పోయిందని ఎలాగైనా చంపాలనుకొని ఈ నెల 22న కల్పన పనిచేసే అడ్వకేట్ కాలనీకి వెళ్లి కాపుకాచాడు. ఆమె రాగానే గొడవ పడి వెంట తీసుకొచ్చిన మటన్ కోసే కత్తితో మెడపై నరికి చంపాడు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేసి ఆదివారం రిమాండ్​ చేసినట్లు సీఐ తెలిపారు.

రామప్పలో కొనసాగుతున్న క్యాంపెయిన్

వెంకటాపూర్ (రామప్ప),వెలుగు: రామప్ప టెంపుల్ లో నిర్వహిస్తున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ లో భాగంగా ఆదివారం యోగా గురువు రాంబాబు యోగాలో శిక్షణ ఇచ్చారు. కాకతీయ కట్టడాలపై పురాతన ఆలయాల నిర్మాణాలపై చరిత్రకారుడు శివనాగిరెడ్డి, తెలంగాణలోని మెట్ట బావుల గురించి ప్రొఫెసర్ కల్పన, నీటిలో తేలే ఇటుకల పైన నిట్ ప్రొఫెసర్ రితీశ్​వివరించారు. సాయంత్రం రామప్ప గార్డెన్ ఆవరణలో వాలంటీర్స్​బంజారా కళాకారులతో కలిసి డ్యాన్స్​చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పాండురంగారావు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు శ్రీధర్, ఇతర అధికారులు కుసుమ సూర్యకిరణ్, మల్లు నాయక్ పాల్గొన్నారు.

కాంగ్రెస్​ నేతకు ఎంపీ పరామర్శ 

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు: మహబూబాబాద్​ బ్లాక్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు నాయిని సత్యపాల్​రెడ్డిని ఎంపీ మాలోత్​ కవిత ఆదివారం నెల్లికుదురు మండలం ఆలేడులో పరామర్శించారు.  ఆయన కుమారుడు సాయి శశాంకరెడ్డి (26) ఈనెల 20న  హైదరాబాద్​లో చనిపోయాడు.  ఎంపీతో పాటు టీఆర్ఎస్​ జిల్లా లీడర్​పర్కాల శ్రీనివాస్​రెడ్డి, కాంగ్రెస్​ లీడర్లు డా.మురళీనాయక్​, ఉమా, రమేశ్​చంద్​రెడ్డి, ప్రకాశ్​రెడ్డి, శ్రీకాంత్​రెడ్డి, శ్రీపాల్​రెడ్డి, యాదవరెడ్డి ఉన్నారు.