హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో శనివారం హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో బాలల హక్కులపై రివ్యూ చేశారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కమిషన్ సందర్శనలో భాగంగా అనేక సమస్యలు గుర్తించామని, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడంలో ఆఫీసర్లు విఫలమయ్యారని చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు.
మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, హనుమకొండ, వరంగల్ డీఈవోలు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గర్భిణులు, బాలింతలు, ఇమ్యూనైజేషన్ స్టేటస్ వివరాలను అందించాలని హనుమకొండ డీఎంహెచ్వో అప్పయ్యను ఆదేశించారు. బాల్య వివాహాలపై నివేదికను అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారులకు సూచించారు.
అనంతరం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ జిల్లాలో బాలల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, బండి అపర్ణ, కంచర్ల వందన గౌడ్, వచన్ కుమార్, ప్రేమలత అగర్వాల్, డీఆర్వో వైవీ గణేశ్, ఆర్జేడీ ఝాన్సీ లక్ష్మీ బాయి, జిల్లా సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
