- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
ఏటూరునాగారం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, లీడర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం ములుగు జిల్లా మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరుసవడ్ల వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసిన వారికి తప్పక పదవులు వస్తాయన్నారు.
ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో సొంత పార్టీ వాళ్లనే ఓడించడానికి కొందరు కుట్రలు పన్నారని, వారు పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం మంత్రి సమక్షంలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలకు చెందిన బీజేపీకి చెందిన మాజీ మండల అధ్యక్షుడు గండెపల్లి సత్యంతో పాటు మరో 50 మంది, బీఆర్ఎస్ నుంచి ఆయా గ్రామాలకు చెందిన ఉప సర్పంచులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నల్లెల్ల కుమార స్వామి మూడో వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు మంత్రి నివాళులర్పించారు. మంగపేట మండలం పాలాయిగూడెంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ రమేశ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. అనంతరం వాగొడ్డుగూడెంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
