
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన బతుకమ్మ కుంటను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అంబర్ పేటలో కబ్జాలకు గురైన బతుకమ్మ కుంటను స్వాధీనం చేసుకున్న హైడ్రా.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఆదివారం (సెప్టెంబర్ 28) మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, వేల మంది ఆడపడుచులు, కార్యకర్తల కోలాహలం నడుమ కొబ్బరికాయ కొట్టి బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేశారు సీఎం.
ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, విమలక్క, గంగవ్వ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ కుంటలో మొదటి బతుకమ్మ వేశారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. బతుకమ్మ కుంట వెనుక అన్నీ తానై నిలిచిన హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. బతుకమ్మ కుంట ప్రారంభం హైడ్రాకు అతి పెద్ద అచీవ్ మెంట్ అన్నారు. విమలక్క పాట పాడి అలరించారు.
వాస్తవానికి సెప్టెంబర్ 26 నే ప్రారంభించాల్సి ఉండగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాయిదా వేశారు. ఆదివారం అంగరంగ వైబవంగా బతుకమ్మ కుంటను ప్రారంభించారు.
ఒకప్పుడు ఆక్రమణలతో సగమైన ఈ బతుకమ్మ కుంట హైడ్రా వచ్చాక తిరిగి పునరుజ్జీవనం పోసుకుంది. 7కోట్ల40 లక్షల రూపాయలతో బతుకమ్మ కుంట సుందరీకరణ చేపట్టింది రాష్ట్రప్రభుత్వం. 5 ఎకరాల 15 గుంటల స్థలంలో బతుకమ్మ కుంట పేరుతో వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇన్ లెట్, ఔట్ లెట్, దీంతోపాటు చుట్టూ వాక్ వే, వాక్ వే చుట్టూ చెట్లు నాటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో అందరిని ఆకర్షిస్తోంది.