ముగిసిన చేప ప్రసాదం పంపిణీ..70 వేల మందికి పైగా అందించిన బత్తిని కుటుంబం

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ..70 వేల మందికి పైగా అందించిన బత్తిని కుటుంబం
  • నేటి నుంచి దూద్​బౌలిలోని బత్తిని నివాసంలో ప్రసాదం పంపిణీ

బషీర్​బాగ్, వెలుగు: ఏటా మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం పంపిణీ సోమవారంతో ముగిసింది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబ సభ్యులు, వాలంటీర్లు చేప ప్రసాదాన్ని అందించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ సోమవారం మధ్యాహ్నం 3 వరకు కొనసాగింది. చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల ప్రజలు భారీగా రావడంతో 24 గంటలు నిర్వహించాల్సిన పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం 3 గంటల వరకు పొడిగించారు.

చేప ప్రసాదం ముగింపు సమయానికి 58,290 కొర్రమీను చేప పిల్లలను విక్రయించినట్టు మత్స్య శాఖ తెలిపింది. 12 వేల మందికి పైగా శాఖాహారులకు బత్తిని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా బెల్లం మందును పంపిణీ చేసినట్టు బత్తిని హరినాథ్ కుమార్తె హరిత నంద పేర్కొన్నారు. చేప ప్రసాదం లభించని వారు దూద్ బౌలిలోని తమ నివాసంలో మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు  చేప ప్రసాదాన్ని అందుబాటులో ఉంచనున్నట్టు బత్తిని కుటుంబ సభ్యులు వివరించారు.