బీడు భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి.. 25 ఏండ్ల పాటు ప్రభుత్వమే కొంటది

బీడు భూముల్లో సోలార్  విద్యుత్ ఉత్పత్తి.. 25 ఏండ్ల పాటు ప్రభుత్వమే కొంటది
  •     1,450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్
  •     డిస్కమ్​లతో 819 మంది రైతుల అగ్రిమెంట్లు
  •     25 ఏండ్ల పాటు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: పీఎం కుసుమ్ పథకం కింద బీడు భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రైతులకు అదనపు ఆదాయం అందించేందుకుగాను.. ‘ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ యోజన’ (పీఎం కుసుమ్) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద పొలాల్లో సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చిన రైతుల్లో 819 మందిని ఎంపిక చేశారు. వీరంతా డిస్కంలతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏ) కుదుర్చుకున్నారు. 1,150 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. 

నోడల్ ఏజెన్సీగా టీజీ రెడ్కో

పీఎం కుసుమ్ కింద.. ఏ, బీ, సీ కేటగిరీలన్నీ కలిపి 4వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ కేటగిరిలో భాగంగా 1,450 మెగావాట్ల సోలార్ పవర్ జనరేట్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్​మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ రెడ్కో)ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. 1,250 మంది ఈఎండీ చెల్లించగా.. వీరిలో 819 మందికి టీజీ రెడ్కో 1,150 మెగావాట్లకు లెటర్ ఆఫ్ అగ్నిమెంట్ (ఎల్​వోఏ) జారీ చేసింది. సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్​పీడీసీఎల్), నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్​ కంపెనీ (ఎన్​పీడీసీఎల్) తో 25 ఏండ్ల కోసం పీపీఏలు కుదుర్చుకున్నారు.

ఒక మెగావాట్​కు 3 ఎకరాలు అవసరం

ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 3 ఎకరాల భూమి అవసరం. మొత్తం సెట్ చేసి.. మెయింటెన్ చేయాలంటే దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్ల వరకు ఖర్చు అవుతాయి. రైతులు సొంతంగా లేదంటే సహకార సంఘాలు, స్వయం సహాయ సంఘాలు, కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకోవచ్చు. బ్యాంకులు 70 నుంచి 75 శాతం వరకు లోన్ అందజేస్తున్నాయి. మిగిలిన 25 నుంచి 30 శాతం లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను డిస్కంలు యూనిట్​కు రూ.3.13 చొప్పున 25 ఏండ్ల పాటు కొంటాయి. ఒక మెగావాట్ ప్లాంట్ నుంచి ఏటా 16.67 లక్షల యూనిట్ల పవర్ జనరేట్ అవుతుంది. 30 ఏండ్ల పాటు నిరంతరాయంగా ప్లాంట్లు పని చేస్తాయి. ఏడేండ్లలో అప్పులు తీరిపోయి.. లాభాలు వస్తాయి.