మార్కెట్లకు జీఎస్టీ బూస్ట్.. దీపావళికి ధరలు తగ్గుతాయనే వార్తలతో భారీ లాభాల్లోకి నిఫ్టీ, సెన్సెక్స్

మార్కెట్లకు జీఎస్టీ బూస్ట్.. దీపావళికి ధరలు తగ్గుతాయనే వార్తలతో భారీ లాభాల్లోకి నిఫ్టీ, సెన్సెక్స్
  • ఆటో, కన్జూమర్​ డ్యూరబుల్​ షేర్లు జూమ్​ 
  • సెన్సెక్స్ 676 పాయింట్లు అప్​
  • ఒక శాతం లాభపడ్డ నిఫ్టీ

ముంబై: - జీఎస్​టీ రేట్లు దీపావళికి తగ్గుతాయన్న వార్తలతో మార్కెట్లు సోమవారం (ఆగస్టు 18) దూసుకెళ్లాయి. ఆటో, కన్జూమర్​ డ్యూరబుల్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. 30 షేర్ల బీఎస్​ఈ సెన్సెక్స్ 676.09 పాయింట్లు పెరిగి 81,273.75 వద్ద స్థిరపడింది.  ఒక దశలో 1,168.11 పాయింట్లు ఎగిసి 81,765.77 గరిష్టాన్ని తాకింది. 50 షేర్ల ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 245.65 పాయింట్ల లాభంతో 24,876.95 వద్ద ముగిసింది.డే ట్రేడింగ్​లో ఇది 390.7 పాయింట్లు పెరిగి 25,022కి చేరుకుంది. భారత సావరిన్​ క్రెడిట్ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను ఎస్​ అండ్​ పీ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయడం, ఉక్రెయిన్ యుద్ధంపై యుఎస్-–రష్యా చర్చలు మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను పెంచాయని ఎనలిస్టులు తెలిపారు. 

సెన్సెక్స్ సంస్థలలో, మారుతి అత్యధికంగా 8.94 శాతం పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ 5 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 3.71 శాతం, బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్ 3.7 శాతం లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ట్రెంట్ కూడా లాభపడిన వాటిలో ఉన్నాయి. ఐటీసీ 1.26 శాతం నష్టపోయింది. ఎటర్నల్, టెక్ మహీంద్రా, లార్సెన్ అండ్ టూబ్రో కూడా క్షీణించాయి. 

"ప్రతిపాదిత జీఎస్​టీ రేట్ల హేతుబద్ధీకరణ దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సెంటిమెంట్ బూస్టర్‌‌‌‌‌‌‌‌గా మారింది. దీంతో పాటు, అమెరికా, రష్యా దేశాల మధ్య జరిగిన సదస్సు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగకుండా ముగియడం కూడా పెట్టుబడిదారుల ఆందోళనలను తగ్గించాయి" అని జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ఆటోమొబైల్ రంగం లాభపడుతుందన్న అంచనాల కారణంగా ఈ కంపెనీల షేర్లు పెరిగాయని తెలిపారు. 

ఆటో  షేర్ల దూకుడు

బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 4.26 శాతం పెరిగి 56,233.33కి చేరుకుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా 8.45 శాతం, అశోక్ లేలాండ్ 8.12 శాతం, టీవీఎస్ మోటార్ 6.58 శాతం, హీరో మోటోకార్ప్ 5.9 శాతం లాభపడ్డాయి.   బీఎస్​ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ సూచీ 1.39 శాతం, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి. బీఎస్​ఈ సెక్టోరల్ సూచీలలో ఐటీ, విద్యుత్, టెక్, బీఎస్​ఈ ఫోకస్డ్ ఐటీ మాత్రమే వెనకబడ్డాయి. బీఎస్​ఈలో 2,560 స్టాక్‌‌‌‌‌‌‌‌లు లాభపడగా, 1,629 స్టాక్‌‌‌‌‌‌‌‌లు నష్టపోయాయి, 176 స్టాక్‌‌‌‌‌‌‌‌లు మారలేదు. 

ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్​ఎస్​ఈ కాంపోజిట్ ఇండెక్స్ లాభాలతో ముగిశాయి. దక్షిణ కొరియా కోస్పి, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టపోయాయి. యూరప్​ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి.