
- అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రజలకు అందుబాటులోకి
- తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసేందుకు సర్కార్ కసరత్తు
- అన్ని గ్రామాలకు పంపాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీలో చర్చ అనంతరం ఈ నివేదికను పబ్లిక్ డాక్యుమెంట్‌గా విడుదల చేయబోతున్నది. ఈ రిపోర్ట్‌ను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి అన్ని గ్రామాలకు పంపాలని నిర్ణయించింది.
దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో చేసిన ప్రచారంలోని నిజానిజాలు, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, రాష్ట్రానికి గుదిబండగా మారిన అప్పుల గురించి జనమే స్వయంగా తెలుసుకుంటారని భావిస్తున్నది. 665 పేజీల కాళేశ్వరం రిపోర్ట్‌లోని కీలక అంశాలను ఇప్పటికే ప్రభుత్వం బయటపెట్టింది. ఫుల్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే కాళేశ్వరంలో జరిగిన అక్రమాలతో పాటు దాని పేరుతో తెచ్చిన అప్పులు రాష్ట్రానికి ఎలా గుదిబండలా మారాయో వివరించాలని భావిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ మొదలుకొని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దాకా ప్రాజెక్టు ప్రతి దశలోనూ అక్రమాలు, ఆర్థిక అవకతవకలు జరిగాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొన్నది.
భారీగా పెరిగిన అంచనా వ్యయం
రూ.38,500 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి, అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.లక్షా 10వేల 248 కోట్లకు పెంచారని, దీని వల్ల ఏజెన్సీలకు మేలు చేశారని కమిటీ తెలిపింది. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రూ.87,449.15 కోట్ల రుణాలు రాష్ట్రంపై గుదిబండగా మారాయని స్పష్టం చేసింది. పైగా ఇందులో కేసీఆర్ అన్ని తానై వ్యవహరించారని, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్‌రావు సహా అధికారులంతా గుడ్డిగా మాజీ సీఎం చెప్పినట్లు చేసి ప్రాజెక్టును నాశనం చేశారని రిపోర్ట్ తేల్చి చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, పాలనా వైఫల్యాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అందువల్లే ఈ రిపోర్ట్‌ను తెలుగులో అర్థమయ్యేలా బయటకు తీసుకురావాలని కాంగ్రెస్ సర్కారు చూస్తున్నది.
సాగునీరు అందింది.. లక్ష ఎకరాల్లోపే..
కాళేశ్వరం నిర్మాణం తర్వాత ఆ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా లక్ష ఎకరాల్లోపే సాగునీరు అందింది. ఎప్ప ట్లాగే శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, జూరాల, కల్వకుర్తి, నిజాంసాగర్ ప్రాజెక్టులు రాష్ట్రంలో సాగు నీటిరంగానికి దిక్కయ్యాయి. సీజన్లవారీగా ఇరిగేషన్ శాఖ విడుదల చేసే స్కివమ్ కమిటీ లెక్కలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ, బీఆర్ఎస్ పెద్దలు మాత్రం ఒక పథకం ప్రకారం, కాళేశ్వరం వల్లే రాష్ట్రంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతున్నట్లు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికే కాళేశ్వరంలోని మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోగా ఆ 3 రిజర్వాయర్ల నుంచి చుక్కనీరు ఎత్తిపోయ లేదు. అయినప్పటికీ.. రికార్డు స్థాయిలో కోటికి పైగా ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. ఇదే విష యాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు కాళేశ్వరం రిపోర్ట్ మంచి అవకాశమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నా రు. ఇటీవలి పంద్రాగస్టు ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావిం చారు. కాళేశ్వ రం ప్రాజెక్టు నుంచి చుక్కానీరు ఎత్తిపోయకున్నా, గత కాంగ్రెస్ సర్కారు నిర్మించిన ప్రాజెక్టుల కిందే రికార్డు స్థాయిలో వరి సాగు అవుతున్నదని గణాంకాలతో సహా స్పష్టం చేశారు.