బతుకమ్మ ఆడుతుంటే అరెస్టు చేసిన్రు

బతుకమ్మ ఆడుతుంటే  అరెస్టు చేసిన్రు

యాదగిరిగుట్ట, వెలుగు:  సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళలపై పోలీసులు ఆత్యుత్సాహం ప్రదర్శించారు. పండుగ రోజు రాత్రి పొద్దుపోయాక లేడీ కానిస్టేబుళ్లు ఎవరూ లేకుండానే మహిళా సర్పంచ్, ఎంపీటీసీని అదుపులోకి తీసుకొని స్టేషన్‌‌కు తరలించారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారంలో ఆదివారం జరిగింది. రాత్రి గ్రామంలో సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళల్ని యాదగిరిగుట్ట పోలీసులు వచ్చి అడ్డుకున్నారు.

డీజే పెట్టడంపై నిషేధం ఉందని డీజే, బాక్స్‌‌లతోపాటు సర్పంచ్ కొండం అరుణ, ఎంపీటీసీ ఎడ్ల సుగుణను పోలీస్‌‌ పెట్రోలింగ్ వెహికల్‌‌లో ఎక్కించారు. మహిళా కానిస్టేబుల్ లేకుండా మహిళలను పోలీస్ వాహనంలోకి ఎక్కించి ఎలా తీసుకెళ్తారని గ్రామస్థులు ఆందోళన చేశారు. ఇవేవి పట్టించుకోని పోలీసులు సర్పంచ్, ఎంపీటీసీలను యాదగిరిగుట్ట స్టేషన్‌కు ​తరలించారు. విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫోన్ చేసి నిలదీయడంతో వారిని తిరిగి గ్రామంలో వదిలి పెట్టారు.

సీఐని సస్సెండ్​ చేయాలి

బతుకమ్మ ఆడుతున్న మహిళా ప్రజా ప్రతినిధులను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న సీఐని సస్పెండ్ చేయాలని పోలీస్‌‌ స్టేషన్‌‌ ఎదుట కాంగ్రెస్​ ఆధ్వర్యంలో గ్రామస్థులు ధర్నా చేశారు. పండగ పూట మహిళల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం దారుణమని యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం అన్నారు. మహిళలకు బతుకమ్మ చేసుకునే స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు.

సీఐ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐ నరసింహారావు మాట్లాడుతూ డీజేతో ఇబ్బందుల కలిగిస్తున్నారనే కంప్లైట్ మేరకే కాచారం వెళ్లి బాక్కులు తీసుకువస్తుండగా.. తాము కూడా వస్తామని మహిళా ప్రజాప్రతినిధులు వెహికల్‌‌ ఎక్కారని చెప్పారు. తాము వారిని అరెస్ట్‌‌ చేయలేదన్నారు.