బతుకమ్మ చీరల బకాయి రూ. 100 కోట్లు…

బతుకమ్మ చీరల బకాయి రూ. 100 కోట్లు…
  • సిరిసిల్ల నేతన్నలకు రూ.100 కోట్లు బాకీ పడ్డ సర్కారు
  • 8 నెలలైనా సొమ్ము రాక ఆందోళన.. పెట్టుబడుల్లేక ఆసాములకు ఇబ్బందులు
  • అప్పుల పాలవుతున్న చేనేత సంఘాలు.. సరిగా పని దొరక్క కార్మికుల తిప్పలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ‘బతుకమ్మ’ చీరలు తయారు చేసిన సిరిసిల్ల నేతన్నలకు సర్కారు రూ.100 కోట్ల దాకా బాకీ పడింది. నిరుడు బతుకమ్మ, రంజాన్, క్రిస్​మస్​ పండుగలకు, స్కూళ్ల యూనిఫారం కోసం కొన్న వస్త్రాల బిల్లుల్లో మూడో వంతు డబ్బు చెల్లింపును పెండింగ్​లో పెట్టింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో చేతినిండా పని ఉంటదని, ఎంతోకొంత లాభం వస్తదన్న సంబురం పోయి దిక్కులు చూస్తున్నరు. ఎనిమిది నెలలైనా సొమ్ము రాకపోవటంతో ఆసాములు ఇబ్బంది పడుతున్నారు. అప్పులు చేసి, వస్త్రాలు రెడీ చేసినమని.. బిల్లులు రాక వడ్డీలు కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆ అప్పులే తీరలేదని, ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీ కోసం మళ్లా అప్పు చేయాల్సి వస్తోందని అంటున్నారు. వెంటనే బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్పుడు పని కల్పించినా..

గతేడాది బతుకమ్మ, రంజాన్, క్రిస్​మస్​ పండుగల సందర్భంగా పంపిణీ కోసం, ప్రభుత్వ స్కూళ్లకు యూనిఫాం క్లాత్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.350 కోట్ల ఆర్డర్లు ఇచ్చింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇరవై వేల మంది సిరిసిల్ల నేతన్నలకు పని కల్పించింది. ఈ ఆర్డర్లకు సంబంధించి మాక్స్, ఎస్ఎస్ఐ సంఘాలకు ముడిసరుకు అందుబాటులో ఉంచటంతోపాటు ఇన్ టైంలో బిల్లులు చెల్లించాలి. ప్రతి పదిహేను రోజులు, నెలకోసారి చీరల తయారీకి అనుగుణంగా ‘టెస్కో’ఆధ్వర్యంలో బిల్లులు చెల్లించాలి. కానీ నిరుడు జూన్​ నుంచి బిల్లుల మంజూరు ఆగిపోయింది. బతుకమ్మ చీరలకు రూ.30 కోట్లు, ఆర్వీఎంకు రూ.55 కోట్లు, రంజాన్​ వస్త్రాలకు రూ.12 కోట్లు, క్రిస్​మస్ వస్త్రాలకు సంబంధించి రూ.3 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉందని చేనేత ఆసాములు చెబుతున్నారు.

ఇప్పుడు పని దొరకట్లే..

నెల రోజుల్లోనే బిల్లులిస్తారన్న భరోసాతో చాలా మంది ఆసాములు పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద మూడు రూపాయల మిత్తికి అప్పులు తెచ్చారు. కానీ బిల్లులు రాకపోవడంతో.. అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక బాధ పడుతున్నారు. మళ్లీ కొత్త చీరలు తయారు చేయాల్సి ఉన్నా పెట్టుబడి లేక ఇబ్బందిపడుతున్నారు. కూలీ పైసలు ఇవ్వలేక కొందరు ఆసాములు సాంచలు బంద్​ పెట్టారు. దీంతో కార్మికులకు పని దొరకని పరిస్థితి నెలకొంది. వస్ట్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న 20 వేల మంది కార్మికులతో పాటు 15 అనుబంధ విభాగాల వారిపై దీని ఎఫెక్ట్​ పడింది. వార్ఫిన్, వైపని, హమాలీ, గుమాస్తాలు, లోడింగ్, అన్​లోడింగ్, గోదాం కార్మికులకు పని ఉండట్లేదు.

కొత్త చీరల తయారీ ఆలస్యం

ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీపై పాత బాకీల ఎఫెక్ట్ పడుతోంది. బిల్లుల జాప్యం, యార్న్​ కొరతతో 30 వేల మరమగ్గాలకుగాను ఎనిమిది వేల మగ్గాలపైనే చీరల తయారీ మొదలైంది. ఈసారి బతుకమ్మ కోసం 94 లక్షల చీరలు, సుమారు కోటి 30 లక్షల మీటర్ల వస్త్రం తయారీకి ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. సిరిసిల్లలోని 122 మ్యాక్స్​(మ్యూచువల్​ ఎయిడెడ్​ కో ఆపరేటివ్​ సోసైటీ) సంఘాలు, 104 ఎస్ఎస్​ఐ (చిన్నతరహా పరిశ్రమల) సంఘాలకు చేనేత జౌళి శాఖ ఈ పని అప్పజెప్పింది. ఆగస్టు నెలాఖరులోగా తయారీ పూర్తి చేసి, ప్రభుత్వానికి అందజేయాలి. అన్ని చీరల తయారీకి మార్చి నుంచి ఆగస్టు వరకు కూడా నిత్యం 30 వేల మగ్గాలు నడవాలి. మే నెలాఖరు వచ్చినా ఎనిమిది వేల మగ్గాలపైనే పని జరుగుతోంది.

యార్న్​ కొరతతోనూ..

యార్న్ (నూలు) కొరత కూడా సిరిసిల్ల నేతన్నలకు సమస్యగా మారింది. బతుకమ్మ చీరలకు యార్న్​ సరఫరా చేసే బాధ్యతను చేనేత జౌళి శాఖ ‘వెల్​నోన్, సనాతన్​, బిలోసా’అనే మూడు కంపెనీలకు అప్పగించింది. కానీ సరిపడా యార్న్​ సరఫరా చేయటంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయని ఆసాములు చెబుతున్నారు. దాదాపు 100 రంగుల్లో తయారు చేస్తున్న చీరలకు సరిపడా యార్న్​ సరఫరా చేసే సామర్థ్యం ఆ కంపెనీలకు లేదంటున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీల యార్న్ నే వాడాలన్న రూల్​తో చీరల తయారీ ముందుకు సాగటం లేదని చెబుతున్నారు.