యాదాద్రి, వెలుగు : భార్య వెన్నంటి ఉంటే గెలుపు ఖాయమని సిద్ధాంతి చెప్పిన మాటతో ఓ వ్యక్తి సర్పంచ్‌గా నామినేషన్ వేయడంతో పాటు తన భార్యతోనూ వేయించాడు. ఇద్దరికీ గుర్తులు కేటాయించినా.. ‘ఓటు మాత్రం నాకే వేయండి’ అంటూ ప్రచారం చేస్తున్నాడు. యాదాద్రి జిల్లా బీబీనగర్ గ్రామానికి చెందిన నారగోని మహేశ్ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా తాను నమ్మే ఓ సిద్ధాంతిని కలువగా.. ‘నీ భార్య వెంట ఉంటే గెలుపు నీదే’ అని సదరు సిద్ధాంతి చెప్పాడు. దీంతో మహేశ్ తాను నామినేషన్ వేసిన తర్వాత భార్య శ్రీలతతోనూ నామినేషన్ వేయించాడు. మహేశ్‌కు ఉంగరం గుర్తు రాగా, శ్రీలతకు కత్తెర గుర్తు వచ్చింది. దీంతో ‘బలం కోసమే నా భార్యను బరిలోకి దించాను.. ఓటు మాత్రం నాకే వేయండి’ అంటూ ప్రచారం చేస్తున్నాడు.
