
- ఏటా 2.80 కోట్ల ఖర్చు.. స్కీమ్‌పై మిశ్రమ స్పందన
బెంగళూరు: వీధి కుక్కల ఆకలి తీర్చేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ప్రతిరోజూ దాదాపు 5వేల వీధి కుక్కలకు చికెన్, రైస్‌తో కూడిన పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం ఏటా సుమారు రూ. 2.88 కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ స్కీమ్ ద్వారా కుక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు ఆకలితో కలిగే దూకుడు స్వభావాన్ని తగ్గించి, బెంగళూరు వీధుల్లో భద్రతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కింద నగరంలోని 8 జోన్లలో 100–-125 ఫీడింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి కుక్కకు రోజూ 367 గ్రాముల ఆహారం (150 గ్రాముల చికెన్, 100 గ్రాముల రైస్, 100 గ్రాముల కూరగాయలు, 10 గ్రాముల నూనె) అందించనున్నారు.
ఇందుకోసం ఒక్కో కుక్కకు రూ. 22.42 ఖర్చు చేయనున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ ఆహారాన్ని సిద్ధం చేసి, శుభ్రమైన గిన్నెల్లో అందిస్తారు. ఫీడింగ్ పాయింట్ల వద్ద శుభ్రమైన డ్రింకింగ్వాటర్ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. కాగా, ఈ స్కీమ్‌పై మిశ్రమ స్పందన వస్తున్నది. కొందరు జంతు ప్రేమికులు దీనిని స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ స్కీమ్ కోసం ఉపయోగించే నిధులతో నగరంలో రోడ్లు, ట్రాఫిక్, పారిశుధ్యంలాంటి ప్రాథమిక
సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.