- లేదంటే పార్లమెంట్‌ను ముట్టడిస్తం.. బీసీ సంఘాల హెచ్చరిక
- బీసీలను వంచిస్తే మరో స్వాతంత్ర్య పోరాటం తప్పదు
- జనగణనను మూకుమ్మడిగా బహిష్కరించాలని పిలుపు
- ఢిల్లీలో అఖిలపక్షాలు, బీసీ సంఘాల మీటింగ్
హైదరాబాద్, వెలుగు: జనగణనలో బీసీ కులగణన చేపడతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం సిగ్గుచేటని అఖిలపక్ష నేతలు, బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. బీసీలను బీజేపీ వంచిస్తే మరో స్వాతంత్ర్య పోరాటం తప్పదని హెచ్చరించారు. జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. 22 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
జాతీయ ఓబీసీ నేత, ఎంపీ ఆర్.పప్పు యాదవ్, స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ జాతీయ జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చకపోతే దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా జనగణనను మూకుమ్మడిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీసీల ఐక్యతను చాటేందుకు జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి చావోరేవో పద్ధతిలో ఢిల్లీపై ప్రజాస్వామ్య పోరాటం చేయాలని కోరారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో ఏ వర్గం కూడా బీజేపీ పాలనలో సంతృప్తిగా లేదన్నారు. తాను బీసీనని చెప్పుకునే ప్రధాని మోదీ తన కులానికి కూడా న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. బీసీ కులగణన కోసం జరుగుతున్న పోరాటం న్యాయమైనదని, దీనికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే జనగణన ప్రక్రియను నిలిపివేసి, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటాం..
బీసీ కులగణనకు తమ పార్టీ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిందని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు అరుణ్‌కుమార్ తెలిపారు. బీసీ సంఘాలు చేస్తున్న పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల లెక్కలు సేకరించకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలోని 80 కోట్ల మంది బీసీల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలిపారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే బీజేపీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించుతామని హెచ్చరించారు.
డిసెంబర్ 14, 15 తేదీల్లో వేలాది మంది బీసీలతో చలో ఢిల్లీ చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్‌రావు, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ మహారాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ భవన్‌రావు తైవాడే మాట్లాడుతూ ఓబీసీ కులగణన కోసం దేశంలోని ప్రతి బీసీ రోడ్డెక్కాలని పిలుపునిచ్చారు. బీసీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీల పర్యటనలను, వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సాహు(బిహార్), గుప్త (చత్తీస్‌గఢ్), సత్యపాల్‌సింగ్(పంజాబ్), శివపాల్ సాహు(ఢిల్లీ), రత్నమాల పీసీ(మధ్యప్రదేశ్), సచిన్ రాజోల్కర్ (మహారాష్ట్ర), రాకేశ్ మౌర్య(యూపీ)తోపాటు తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.
