తెలంగాణలో బీసీ బంద్ ప్రశాంతం..42శాతం కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు

తెలంగాణలో బీసీ బంద్ ప్రశాంతం..42శాతం కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు
  •  
  • 42% కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు
  • ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతోరాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
  • మద్దతుగా కదిలివచ్చిన ప్రధాన పార్టీలు, ప్రజా సంఘాలు
  • పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు మంత్రులు
  • కదలని బస్సులు.. మూతపడ్డ విద్య, వ్యాపార సంస్థలు
  • రిజర్వేషన్లు దక్కేదాకా పోరు ఆగదు: బీసీ జేఏసీ చైర్మన్​ ఆర్​.కృష్ణయ్య

హైదరాబాద్​, వెలుగు:  స్థానిక ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో శనివారం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్​ సక్సెస్​అయింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో దీన్ని తెలంగాణ బీసీ జేఏసీ 
నిర్వహించగా.. అధికార పార్టీ కాంగ్రెస్​తోపాటు బీఆర్ఎస్, బీజేపీ, అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సాయంత్రం వరకు బస్సులు రోడ్డెక్కకపోవడంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలు, ఇతర పట్టణాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా చూశారు. మండల్ కమిషన్ నాటి బంద్ కంటే గొప్పగా ఇప్పుడు బంద్​ సక్సెస్​ అయిందని, ఇది చరిత్రాత్మక విజయమని  బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య అన్నారు. కోటా సాధించుకునే వరకు పోరాటం ఆగదని.. మరింత తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు. 

తరలివచ్చిన నాయకులు

బంద్‌లో అన్ని ప్రధాన పార్టీల నాయకులు పాల్గొని బీసీల డిమాండ్‌కు మద్దతు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్ హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. బీసీ కోటాను బీజేపీనే అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో తమకున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదని, త్వరలో సీఎం నేతృత్వంలో ప్రధాని మోదీని కలుస్తామని ప్రకటించారు. చెన్నూర్‌, మందమర్రి, మంచిర్యాలలో చేపట్టిన రాష్ట్ర బంద్‌లో మంత్రి వివేక్​ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు. రాహుల్‌ గాంధీకి క్రెడిట్ పోతుందనే బీసీ కోటాను బీజేపీ అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు. ట్యాంక్​బండ్​ దగ్గర అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్​, సీతక్క మాట్లాడుతూ.. ఇది ఆరంభం మాత్రమేనని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేస్తామని ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు మాట్లాడుతూ.. చట్ట సవరణ వల్లే మోదీ బీసీ అయ్యారని, కాబట్టి కోటా చట్టంతో బీసీలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ వంటి నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని వారు ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో తన కుమారుడు ఆదిత్యతో కలిసి పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఎంపీ ఈటల రాజేందర్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. బీజేపీ మరో నేత ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీని తామెందుకు నెరవేర్చాలంటూ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ మాట్లాడుతూ..  రాజ్యాంగబద్ధంగా కోటా సాధించే వరకు పోరాడుతామని, కుట్రలను ఛేదిస్తామన్నారు. అనేక చోట్ల బీసీయేతర కుల సంఘాల నాయకులు కూడా బంద్​లో పాల్గొని సంఘీభావం తెలిపారు. బీసీ జేఏసీ వర్కింగ్​ చైర్మన్​ జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి బంద్​లో ఎమ్మార్పీఎస్​ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. కాగా, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌‌‌‌ను బలంగా వినిపించడంలో ఈ బంద్ కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

చెదురుమదురు ఘటనలు

రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. కొన్నిచోట్ల స్వల్ప ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి.  హైదరాబాద్‌‌‌‌లోని నల్లకుంటలో తెరిచి ఉన్న కొన్ని వ్యాపార సంస్థలపై కొందరు రాళ్లు విసరడం, ఎంజే మార్కెట్‌‌‌‌లో ఓ షాపుపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయి. హిమాయత్ నగర్‌‌‌‌లోని నిలోఫర్ కేఫ్‌‌‌‌ను బలవంతంగా మూయించారు. ఉప్పల్ డిపో వద్ద బీసీ సంఘాల నాయకులు వరంగల్ హైవేపై టైర్లు కాల్చి నిరసన తెలుపడంతో  ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో సీపీఐ నాయకులు బంద్ చేయిస్తున్న క్రమంలో శ్వేత హోటల్‌‌‌‌ సిబ్బంది నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత హోటల్‌‌‌‌ను మూసివేయించారు. నల్గొండ జిల్లా చర్లపల్లి లో ఉన్న పవన్ మోటార్స్ నెక్సా షో రూమ్​పై కొంతమంది  దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో షో రూమ్ నిర్వాహకులు రూరల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా డీఎస్పీ శివరాం రెడ్డి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.  మిర్యాలగూడ లోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లోకి  కొంతమంది  చొరబడి సిబ్బంది పై దాడికి దిగారు.