
- బీజేపీకి మద్దతు పలకండి: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యాపేట జనగర్జన బహిరంగ సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రకటించటంపై ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇది సువర్ణ అవకాశమని, బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అటు బీఆర్ఎస్ లో కానీ ఇటు కాంగ్రెస్ లో కానీ అవకాశాలు ఇవ్వకుండా బీసీలను రాజకీయంగా ఎదగనీయడం లేదని, ఆ పార్టీలలో బీసీలకు సీఎం అయ్యే అవకాశం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని మేధావులు, వివిధ సంఘాల నాయకులు ఆలోచించాలని బీజేపీకి మద్దతుగా నిలవాలని సూచించారు. బీజేపీ మొదటి నుంచి నిమ్నవర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని, హోం మంత్రి, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు.