
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ కులాల డేటా సేకరణకు బీసీ కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. విధివిధానాలు, కావాల్సిన నిధుల గురించి విన్నవించింది. మూడు నాలుగు నెలల్లో డేటా సేకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఈ లెక్కలు తీస్తున్నట్లు కమిషన్ అధికారులు చెప్తున్నారు. అయితే.. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఉన్నప్పటికీ ఆ వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదు. పైగా రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కొత్తగా బీసీల లెక్కలు తీయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
లోకల్ బాడీ రిజర్వేషన్ల కోసం..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు గతంలో 34 శాతం రిజర్వేషన్లు ఉండగా.. 2019 జరిగిన ఎన్నికల్లో 24 శాతానికి తగ్గించారు. అన్ని రకాల రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దనే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు.. బీసీల లెక్కలు లేనప్పుడు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తారని ప్రశ్నించింది. లెక్కలు తీసి సమర్పిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో డేటా సేకరణ పనిలో పడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికల్లా సేకరణ పూర్తి చేసి, కోర్టుకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీసీల సమాచారం ఉంటేనే రిజర్వేషన్లు పెంచడం, లేదా ఇప్పుడున్న రిజర్వేషన్లు తగ్గకుండా ఆపేందుకు చాన్స్ ఉంటుంది.
క్వశ్చనీర్, రోడ్‌మ్యాప్ కోసం ప్లానింగ్
రాష్ట్రంలో బీసీల సమాచార సేకరణ అనేది చిన్న విషయమేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికే తిరిగి పక్కా డేటా సేకరించాల్సి ఉంటుంది. సేమ్ జనాభా లెక్కల మాదిరిగా అన్ని విభాగాలు భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. అయితే ఇందు కోసం ముందుగా క్వశ్చనీర్, రోడ్ మ్యాప్ రూపొందించే పనిలో బీసీ కమిషన్ నిమగ్నమైంది. క్వశ్చనీర్‌లో ఎన్ని ప్రశ్నలు ఉండాలి..? పేరు, వృత్తి, ఆదాయం, ఆస్తులు, కుటుంబ సభ్యుల వివరాలు.. ఇలా ఏయే అంశాలు ఉండాలనేది క్షుణ్నంగా పరిశీలిస్తున్నది. కొంచెం అటు ఇటు అయినా సంఘాలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు పాటిస్తున్నది. క్వశ్చనీర్‌కు ఆస్కి, సీజీజీ, సెస్ తదితర సంస్థల సహాయం తీసుకునే చాన్స్ కనిపిస్తున్నది. కాగా, సమాచార సేకరణపై ఇతర రాష్ట్రాల్లో బీసీ కమిషన్ పర్యటించనుంది. త్వరలో తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను సందర్శించి, అధ్యయనం చేయనుంది.
లెక్కల సేకరణకు రూ. 500 కోట్లు!
రాష్ట్ర వ్యాప్తంగా డేటా సేకరణకు రూ. 500 కోట్లకు పైగా అవసరమవుతుందని బీసీ కమిషన్ అంచనా వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కమిషన్‌లో సరిపోయే స్టాఫ్, ఎక్విప్‌మెంట్ లేదని, దాన్ని సమకూర్చాలని సర్కారుకు విన్నవించినట్లు సమాచారం. ఇందుకు వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే 2014లో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కుటుంబానికి సంబంధించి అన్ని రకాల వివరాలు సేకరించింది. కానీ ఇప్పటికీ అందులోని ఏ ఒక్క అంశం కూడా బయటకు వెల్లడించలేదు. తాజాగా మళ్లీ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో సమాచారం సేకరించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.