గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి

గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో భూభారతి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన కొండాపూర్ మండలంలోని ప్రతీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్​ క్రాంతి సూచించారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొండాపూర్ మండలంలో ఈ నెల 5 నుంచి 19 వరకు 23 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. 

అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. హెల్ప్​డెస్క్​లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి  సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్, తాగునీరు, సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్​కలెక్టర్ మాధురి, అధికారులు పద్మజారాణి, రవీందర్ రెడ్డి, అశోక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

ఆదివారం జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో సెంటర్​కు చేరుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. జిల్లాలో 3,320 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అనుమతిస్తారన్నారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి ఉండదన్నారు. సెంటర్ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉంటుందని వెల్లడించారు.