
- బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: చేర్యాల మండలం వేచరేణి గ్రామం ఎల్లదాస్ నగర్ కు చెందిన దళిత యువకుడు ఉబిది అజయ్ పై దాడికి పాల్పడిన వారిపై కొమురవెల్లి పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శనివారం ఈ ఘటనకు బాధ్యులైన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు. ఏసీపీ సతీశ్ కథనం ప్రకారం.. ఎల్లాదాస్ నగర్ కు చెందిన ఉబిది అజయ్ గత నెల 29న మద్యం మత్తులో హనుమాన్ గుడి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న విగ్రహాలను పగలగొట్టి, హనుమాన్ పెద్ద విగ్రహాన్ని కాలితో తన్నాడని తెలిపారు. ఈ విషయంపై కొమురవెల్లి, చేర్యాల, వేచరేణి గ్రామాలకు చెందిన కొందరు అజయ్ ను నిలదీసి రోడ్డుపై కొట్టుకుంటూ హనుమాన్ గుడి వద్దకు తీసుకువెళ్లారు.
ఈ దాడితో సంబంధం ఉన్న కొమురవెల్లికి చెందిన బైరి హరీశ్, పాశం భరత్ కుమార్, ఎక్కలదేవి శ్రీనివాస్, మెరుగోజు వెంకటేశం, గొడుగు సాయి కుమార్, ఐత రాజు, ఉదయ ప్రకాశ్, పడకంటి వినయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపినట్టు తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఘటనతో సంబంధం ఉన్న మరికొందరిని త్వరలో అరెస్టు చేస్తామని ఏసీపీ వెల్లడించారు.
వేచరేణినికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్
చేర్యాల మండలం వేచిరేణి గ్రామాన్ని తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. మతం ముసుగులో హిందువులపై హిందువులే దాడికి పాల్పడడం అమానుషం అన్నారు. దళిత యువకుడు అజయ్ పై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
వేచరేణి ఘటన దురదృష్టకరం
ఎల్లదాస్ నగర్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. చేర్యాల పీఎస్లో వివరాలను తెలుసుకుని మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ వ్యక్తి తాగిన మైకంలో హనుమాన్ విగ్రహంతో పాటు ఇతర దేవతా విగ్రహాలను కాళ్లతో తన్ని అవమానించాడని అన్నారు. దీంతో స్థానిక ప్రజలు, హనుమాన్ భక్తులు అతడిని దండించారన్నారు. ఈ సంఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.