
ఈ భూమ్మీద నివసిస్తున్న మనమంతా విభిన్న సంస్కృతులకు చెందినవాళ్లం. అయినప్పటికీ ప్రతి మనిషి కోరిక ఒక్కటే.. సంతోషంగా ఉండాలని. కానీ, ప్రతి మనిషీ సంతోషంగా ఉండాలంటే డబ్బు, పేరు ప్రతిష్టలు, లగ్జరీ లైఫ్ కావాలనుకుంటాడు. అవి సంపాదించేవరకు నిత్యం వాటివెంట పరుగెడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో తాను దేనికోసమైతే పరుగెడుతున్నాడో దాన్నే మర్చిపోతాడు. అలా సంతోషానికి దూరమై అసంతృప్తి, నిరాశ, నిస్పృహల్లో బతుకుతుంటాడు. కనీసం పెదాలపై చిరునవ్వుకు కూడా నోచుకోని వాళ్లెందరో ఈ రోజుల్లో. నిజానికి సంతోషంగా జీవించడానికి పెద్దగా ప్రయాస పడక్కర్లేదు. కానీ, నేటి సమాజం నిత్యం మానసిక ఒత్తిడి, బాధ, కుంగుబాటుతో సతమతమవుతోంది. ఇలాంటప్పుడే జపనీస్ టెక్నిక్ అయిన వాబి–సాబి అనే సూత్రం గుర్తొస్తొంది. అది సంతోషాన్నిచ్చే సూత్రం మాత్రమే కాదు.. జీవన వేదం కూడా.
ప్రపంచాన్ని మరో దృష్టితో చూడడమే వాబి– సాబి టెక్నిక్. వాబి అంటే మొదట్లో ఒంటరితనం అనేవారు. ఇప్పుడు దీన్ని సింప్లిసిటీ, నిశ్శబ్ద సౌందర్యంగా పిలుస్తున్నారు. సాబి అంటే వయసు, అనుభవంతోపాటు వచ్చే సౌందర్యం. వాబి – సాబి పదాలు రెండూ కలిపితే జననం, మరణాలతోపాటు జీవితాన్ని గౌరవించడం అనే అర్థం వస్తుంది. ఇందులో భాగంగా నేర్చుకోవాల్సిన అంశాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం.
లోపాలను అంగీకరించాలి
ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి. అయితే సాధారణంగా అందరూ తమ లోపాలను సరిదిద్దుకోవడానికి, పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయితే వాబి –సాబి టెక్నిక్ మాత్రం ప్రతీది అందంగానే ఉంటుంది అంటుంది. పగిలిన గ్లాసు, విరిగిన చెక్క.. అంతెందుకు వయసు పైబడ్డాక ముఖంలో కనిపించే ముడతలు కూడా అందమే అంటుంది. ఈ లోపాలు పరిష్కరించాల్సిన సమస్యలు కాదు. కథలుగా చెప్పుకునే మార్చలేని వాస్తవాలు. మనతోపాటు ఇతరుల్లోని లోపాలను కూడా అంగీకరించాలి. అప్పుడే తక్కువ ఒత్తిడికి గురవుతాం. ఎక్కువ ప్రశాంతంగా ఉంటాం.
సింప్లిసిటీకి విలువనివ్వాలి
ఏ విషయంలోనైనా అతి పనికిరాదు అంటుంటాం. కానీ కొన్నిసార్లు మనమే అనవసరమైన వాటి గురించి అతిగా ఆలోచిస్తుంటాం. దాంతో అసలు ఆలోచించాల్సిన విషయం మరుగున పడిపోతుంటుంది. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టయిల్లో అంతా లగ్జరీ లైఫ్ కోరుకుంటున్నారు. కానీ, వాటి కోసం పరుగెత్తే క్రమంలో చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నారు. అందుకే సింప్లిసిటీకి విలువనివ్వాలి అని చెప్తోంది వాబి – సాబి. అంటే ఆస్తులు తక్కువగానే ఉండాలి. సహజంగా తయారైన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రకృతిలోని నిశ్శబ్ద క్షణాలను కూడా ఎంజాయ్ చేయాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితులను సింప్లిఫై చేయడం ద్వారా ప్రశాంతత, కృతజ్ఙత, ఆనందం అనే అంశాలకు చోటు ఇచ్చినవాళ్లమవుతాం.
వదిలేయాలి
ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. రుతువులు మారడం, వికసించిన పూలు వాడిపోవడం. అలాగే జీవితంలో మార్పు సహజం. ప్రతి మనిషికీ వయసు పైబడడం ఖాయం. కాబట్టి ఎప్పటిదప్పుడు వదిలేసి ముందుకు వెళ్లాలి. మార్పుకు భయపడకుండా ప్రతిదాన్ని స్వీకరించి అందులోని అందాన్ని ఆస్వాదించాలి. ఒకేలా ఉండాలనే ఆలోచనకు అతుక్కుపోతే ఏవీ మారవు. జీవితంలో ప్రతి దశలో హ్యాపీగా ఉండాలంటే అందుకు అనుగుణంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి.
►ALSO READ | ఆధ్యాత్మికం: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే... వంట చేసేందుకు కూడా నియమాలున్నాయి
పెదవిపై చిరునవ్వులు చిందించడానికి చెమటోడ్చాలా? లేకపోతే అహర్నిశలు శ్రమపడి పంటలా పండించాలా? అక్కర్లేదు కదా. అనే అర్థం వచ్చేలా మన తెలుగు సినిమాలో ఒక పాట ఉంటుంది. ఆ పాట వింటున్నంతసేపూ అందులోని ప్రతి లైనూ నిజమే కదా! అనిపిస్తుంటుంది. అదే సినిమాలో ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ సొంతవాళ్లలా ఫీలవుతూ నవ్వుతూ పలకరించే ఓ పాత్ర ఎవరూ మర్చిపోలేరు. ఆ పాత్ర తెరపై కనిపించినప్పుడల్లా తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్‌ని ఫీలవుతుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఎవరికి వారే అన్నట్టు ఉంటారు. ఒక్కసారి మనసుపెట్టి ఆలోచిస్తే.. ఒక పాత్ర పంచే పాజిటివ్ ఫీల్‌ని అంతగా ఆస్వాదిస్తున్నప్పుడు.. రియల్ లైఫ్లో ఒకరితోఒకరు పాజిటివ్‌గా ఉంటే ఎంత బాగుంటుందో మన మనసుకే అర్థం అవుతుంది.
కష్టం, నష్టం అనేవి ప్రతి మనిషికీ ఉండేవే. బాధలు, సంతోషాలు రుతువుల్లాంటివే. ఏవీ ఎక్కువకాలం ఉండవు. వాటి కాలంలో అవి వచ్చిపోతుంటాయంతే. అందుకని మన జీవితాలు సంతోషంతో నిండాలంటే.. రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. దేనికీ హైరానా పడిపోకుండా సింపుల్‌గా బతకడం నేర్చుకోవాలి. అప్పుడు మనం కోరుకున్న సంతోషం మనల్నే వెతుక్కుంటూ వస్తుంది.