శివ్వంపేట మండలంలో పోలీసులపై మందుబాబుల దాడి

శివ్వంపేట మండలంలో పోలీసులపై మందుబాబుల దాడి

శివ్వంపేట, వెలుగు: మండల కేంద్రంలోని తూప్రాన్- నర్సాపూర్ రహదారిపై శనివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు వారిపై దాడి చేశారు. మండలంలోని గోమారం గ్రామానికి చెందిన రషీద్, ఏపీలోని విజయవాడకు చెందిన ధనావత్ సైదా నాయక్, ముఖ్ భీమ నాయక్, గూగులోతు గోపి నాయక్, ధనావత్ నందు నాయక్ బొజ్యా తండాకు పెళ్లికి వచ్చారు. అక్కడ మద్యం తాగి బైక్ ల మీద శివ్వంపేట వైపు నుంచి చండి వైపు వస్తున్నారు. హెల్మెట్ లేకుండా రెండు బైకులపై వస్తుండగా ఏఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు మహేందర్, సుధాకర్ బైకులను ఆపి  డ్రంకన్​డ్రైవ్​చేయడానికి యత్నించగా వారు పోలీసులపై తిరగబడ్డారు. 

ఆ సమయంలో అటువైపు వెళ్తున్న ప్రయాణికులు, పక్కనే ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు వారిని ఆపినా ఆగకుండా పోలీసులపై దాడికి దిగారు. గోమారానికి చెందిన రషీద్ పోలీసులపై వీరంగం సృష్టించి బెల్టుతో,  చేతులతో దాడి చేశాడు. వారిని పీఎస్​కు తీసుకువచ్చినా ఆగకుండా స్టేషన్ లో ఉన్న కానిస్టేబుళ్లు యాదయ్య, హరీశ్, హెడ్ కానిస్టేబుల్ సాయిలు పై దాడి చేశారు. ఎస్ఐ మధుకర్ రెడ్డి సిబ్బందితో కలిసి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆగకుండా బూతు తిడుతూ స్టేషన్ లో వీరంగం సృష్టించారు. పోలీసులపై దాడి చేసిన  ఐదుగురిపై కేసు నమోదు చేసి, రెండు బైకులు, సెల్​ఫోన్​లు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు.