- బాధ్యులను శిక్షించాలని, కృష్ణయ్యకు సెక్యూరిటీ పెంచాలని డిమాండ్
అంబర్పేట/ముషీరాబాద్/బషీర్బాగ్/ఓయూ, వెలుగు : ఏపీలోని శ్రీకాళహస్తిలో రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై రాయి దాడిని బీసీ సంఘాలు ఖండించాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, కృష్ణయ్యకు సెక్యూరిటీ పెంచాలని డిమాండ్చేశాయి. ఈ మేరకు సిటీలోని వేర్వేరుచోట్ల శుక్రవారం నిరసన తెలిపాయి. ఎన్నో త్యాగాలు చేసి, బీసీల అభివృద్ధి కోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్యను చూసి ఓర్వలేక రాయితో దాడి చేశారని జాతీయ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణయ్యకు మరింత సెక్యూరిటీ కల్పించాలని ఈసీని కోరారు. శుక్రవారం అంబర్పేట అలీ కేఫ్ చౌరస్తాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిరసన తెలిపింది. గవ్వల భరత్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కృష్ణయ్యపై దాడి యావత్ బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నామన్నారు. ఆర్.కృష్ణయ్యపై దాడిని పిరికిపంద చర్యగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం చెప్పారు. సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఆయన కాచిగూడలో మీడియాతో మాట్లాడారు. దాడిచేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరారు. .
ఆర్.కృష్ణయ్యకు ఈసీ భద్రత పెంచాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ కోరారు. దాడిని ఖండిస్తూ సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఆయన ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన తెలిపారు. కృష్ణయ్యపై దాడిని బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్స్ జాతీయ అధ్యక్షుడు రామ్ గోపాల్ యాదవ్ ఖండించారు. విద్యానగర్ బీసీ భవన్ లో రామ్గోపాల్మీడియాతో మాట్లాడారు.
