- బీసీలకు జనాభా దామాషాప్రకారం కోటా ఇవ్వాలి
- కేంద్రానికి బీసీ జేఏసీ చైర్మన్ జాజుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న 50 శాతం పరిమితిని తక్షణమే రద్దుచేసి, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ బీసీ అధ్యక్షుడు కేసన శంకర రావు డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా పోరాటాలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఆదివారం ఏపీలోని కాకినాడలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శ్రీనివాస్ గౌడ్, శంకర్ రావు మాట్లాడుతూ బీసీల పోరాటం ఫలితంగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కులగణన ఆధారంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
‘‘అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయాయి. బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేసినప్పుడు మాత్రమే 50 శాతం పరిమితిని తీసుకురావడం ఎంతవరకు న్యాయం? మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి” అని జాజుల, శంకర్ రావు డిమాండ్ చేశారు.
