బీసీ రిజర్వేషన్లపై 31న ఆల్ పార్టీ మీటింగ్ : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ రిజర్వేషన్లపై  31న ఆల్ పార్టీ మీటింగ్ : జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     బీసీ  జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు అంశంపై  అసెంబ్లీ సమావేశాల్లోని విస్తృతంగా చర్చించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యచరణను రూపొందించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.  లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం సెక్రటెరియట్ మీడియా పాయింట్​లో బీసీ జేఏసీ నేతలతో కలిసి జాజుల మీడియాతో మాట్లాడారు.  

అసెంబ్లీ సమావేశాల బీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించడానికి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.  తాము అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం  పెంచాలని చేసిన చట్టం గురించి కానీ, బిల్లు గురించి కానీ చర్చిద్దామని నిర్ణయించకుండా నీళ్ల అంశం ను తెరమీదకు తీసుకొచ్చారని విమర్శించారు. 

రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలని రాష్ర్ట ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.  బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీల వైఖరి వెల్లడించడానికి , అసెంబ్లీలో చర్చించడానికి ఈనెల 31వ తేదీన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నామని జాజుల వెల్లడించారు.