రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి : బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు

రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి : బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు
  • బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు పిలుపు
  •     రాబోయే ఎన్నికల నాటికి ప్రత్యేక శక్తిగా ఎదగాలని సూచన

పంజాగుట్ట, వెలుగు: రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ‘బీసీ రక్షణ చట్టం కోసం పోరాడదాం’ అనే అంశంపై రౌండ్‌‌‌‌‌‌‌‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ సంఘాలు ఎవరికి వారు తెలంగాణవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాబోయే ఎన్నికల నాటికి ప్రత్యేక శక్తిగా ఎదగాలని సూచించారు. బీసీల శక్తిని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆత్మగౌరవం, అస్థిత్వ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ప్రతి జిల్లా స్థాయిలో బీసీ నాయకులు శాసించే స్థాయిలో ఉన్నప్పుడే ఆయా రాజకీయ పార్టీలు బీసీలకు పెద్దపీట వేస్తాయని, అందుకు తగ్గట్లుగా అన్ని బీసీ సంఘాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. బీసీ ఉద్యమ నేత కటకం నర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ ఉద్యమ నేతలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ నేతలపై దాడులు చేస్తే ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు నరేందర్ గౌడ్, పావని, భాగ్యరేఖ, నరేశ్, రాజుగౌడ్, లలిత లు పాల్గొన్నారు.