మందమర్రిలో న్యాయ సేవలు..ప్రారంభానికి సిద్ధమైన కోర్టు

మందమర్రిలో న్యాయ సేవలు..ప్రారంభానికి సిద్ధమైన కోర్టు
  •      రూ.70లక్షలతో భవనాన్ని ఆధునీకరించిన సింగరేణి 
  •      స్పీడప్​కానున్న కేసుల పరిష్కారం​ 

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలో న్యాయస్థానం సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని హంగులతో ఏర్పాటు చేసిన కోర్టు మరికొద్ది రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మందమర్రి సర్కిల్​లోని నాలుగు పోలీస్​స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న కేసులకు సంబంధించి కక్షిదారులు ఏళ్లుగా మంచిర్యాల, బెల్లంపల్లి కోర్టుల్లో విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలకు న్యాయసేవలు చేరువయ్యేలా, త్వరితగతిన కేసుల పరిష్కారం కోసం మందమర్రిలో జూనియర్​ సివిల్​ జడ్జి న్యాయస్థానం ఏర్పాటైంది.

సీఐఎస్​ఎఫ్​ క్యాంపు భవనంలో …

మందమర్రిలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలనే చాలా ఏండ్లుగా డిమాండ్​ఉంది. ఈ నేపథ్యంలోనే మందమర్రిలోని సీఐఎస్​ఎఫ్​క్యాంపు భవనాల్లో జూనియర్​ సివిల్​జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. సింగరేణి యాజమాన్యం కూడా అద్దె​ప్రాతిపదికన క్యాంపు భవనం ఇచ్చేందుకు అంగీకరించింది. కోర్టు భవనంగా మార్చేందుకు సింగరేణి నిధులు రూ.70 లక్షలతో పూర్తి స్థాయి హంగులతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. మందమర్రి సర్కిల్​ పరిధిలోని మందమర్రి, రామకృష్ణాపూర్, కాసిపేట, దేవాపూర్​పోలీస్​స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న కేసులకు సంబంధించి కక్షిదారులు 10 నుంచి 30 కిలోమీటర్ల దూరం పయాణించి మంచిర్యాల, బెల్లంపల్లి న్యాయస్థానాల్లో విచారణకు హాజరవుతున్నారు. ప్రతి నెల మందమర్రి సర్కిల్​ పరిధిలో 80 కేసుల చొప్పున ఏటా 800 వరకు నమోదువుతున్నట్లు సమాచారం. 3 నుంచి 4 వేల లోపు కేసులు న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నాయి. మందమర్రిలో కోర్టు ప్రారంభమైతే ఆయా న్యాయస్థానాలకు హాజరవుతున్న వారికి అనుకూలం కానుంది.

కేసుల పరిష్కారానికి ఆస్కారం

మందమర్రిలో కోర్టు సేవలు అందుబాటు లోకి వస్తే  త్వరితగతిన కేసుల పరిష్కారానికి అస్కారం ఉంటుంది. సత్వర న్యాయం కూడా అందుతుంది. మందమర్రి సర్కిల్​లోని నాలుగు పోలీస్​స్టేషన్ల పరిధిలోని కక్షిదారు లకు, సాక్షులకు దూరాభారం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
- పర్స రమేశ్, సీఐ, మందమర్రి