- ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
కాగజ్ నగర్, వెలుగు : తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఉద్యమకారుల పాత్ర కీలకమైందని, ఒకరిద్దరి ద్వారానే తెలంగాణ వచ్చిందని గత దశాబ్దం పాటు జరిగిన ప్రచారం.. ఇప్పుడు సకల జనుల పోరాట ఫలితమని ప్రజలకు అర్థమైందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇటీవల ఉద్యమకారుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు.
ఉద్యమకారులకు మేలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు. ఉద్యమకారులను గుర్తించి సముచిత గౌరవం లభించేలా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉద్యమకారులు, స్టూడెంట్స్, జేఏసీ, ట్రేడ్ యూనియన్, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు.
ఇప్పటికే 13 వేల మందితో ఇంటరాక్ట్ అయ్యామని చెప్పారు. ఉద్యమకారుల గుర్తింపుపై పూర్తి నివేదిక తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని అప్పుడు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం లిస్టులు తయారు చేస్తున్నామని, పేర్లు రాస్తామని చెబుతూ ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు అడిగితే ఇవ్వొద్దని సూచించారు. ఆధిపత్యం కోసం ఆంధ్రా నాయకులు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్, జేఏసీ అధ్యక్షుడు కిశోర్ బాబు, నాయకులు రవీందర్ రావు ఉన్నారు.
