- అఖిలపక్ష సమావేశంలో నేతలు, బీసీ సంఘాల లీడర్లు
- కులగణన సాధనకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని వెల్లడి
ఖైరతాబాద్, వెలుగు : రాష్ట్రంలో సమగ్ర కులగణన అమలయ్యేంత వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని అఖిలపక్ష నాయకులు, బీసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేకులు న్యాయపరంగా అవరోధాలు సృష్టించవచ్చని, దానికి ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని 6 నెలలుగా పలు రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం విజయవంతమైందని, బీసీల సమష్టి పోరాటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 18 విడుదల చేసిందన్నారు.
సమగ్ర కుల గణనకు మద్దతుగా అఖిలపక్ష రాజకీయ పార్టీలతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. ‘‘ఇంత వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చూశారు. ఇకపై బీసీ కులగణన కోసం చేసే ఉద్యమం చూస్తారు”అని వారు పేర్కొన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందుగా బీసీ కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీని కోరారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. కులగణన పూర్తయ్యే వరకు బీసీ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. -జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలోనే కులగణన సాధనకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.