- బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు హాజరు
- జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో గెట్ టు గెదర్
హైదరాబాద్, వెలుగు: వివిధ పార్టీల్లోని బీసీ నేతలు శుక్రవారం రహస్యంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు సహా 200 మంది నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు బీసీ నేతలు ఈ మీటింగ్‌కు హాజరై తమ అసంతృప్తి గళాలను వినిపించినట్లు తెలిసింది. పార్టీలో టికెట్ దక్కకుంటే ఏం చేయాలన్న దానిపై చర్చించినట్టు సమాచారం. ‘మేమెంతో మాకంత’ అన్న నినాదాన్నే ఎన్నికల్లో వినిపించాలని డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలో రాజకీయ వాటా దక్కించుకోవాల్సిందేనని మీటింగ్‌లో బీసీ నేతలు తీర్మానించినట్టు తెలిసింది. గెలుపు గుర్రాలంటూ రెడ్లు, వెలమలకు టికెట్లు ఎక్కువ కేటాయించొద్దన్న డిమాండ్‌నూ వినిపించినట్టు సమాచారం. కాగా, బీసీల జనాభా దాదాపు 60% ఉన్న నేపథ్యంలో 60 సీట్లు సాధించాల్సిందేనని బీసీ నేతలు సమావేశంలో తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం 3 స్థానాలను సాధించుకుకోవాలని నేతలు నిర్ణయించినట్టు సమాచారం. బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించేందుకు పార్టీల రాష్ట్రాధ్యక్షులతో భేటీ నిర్వహించాలని నేతలు తీర్మానించారని తెలిసింది.
