బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు ఆందోళన

బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు ఆందోళన

గురుకుల విద్యార్థుల సమస్యలు పట్టించుకోవట్లేదని బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు ఆరోపించారు. మాసబ్ ట్యాంక్ లోని బీసీ గురుకుల కార్యాలయం ముందు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకోని మహాత్మ జ్యోతిభా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శిని మార్చాలని జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందించాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల సొసైటీ ఏర్పాటు చేసి, అనేక గురుకులాలు మంజూరు చేసిందని తెలిపారు. 

అయితే కార్యదర్శిగా కొనసాగుతున్న మల్లయ్య భట్టు గురుకుల సొసైటీ కార్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు నెలల తరబడిగా అందుబాటులో ఉండడంలేదని జేఏసీ చైర్మన్ ఆరోపించారు. ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి సమస్యలు చెప్పుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. పాఠశాలలు ప్రారంభమై 4 నెలలు కావస్తున్నా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల ఖాళీల భర్తీకై చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న సీట్లను వెంటనే భర్తీ చేయాలని... లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి గురుకుల సొసైటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.