కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ కోల్‌కతాలోని యువ భారతి స్టేడియంలో పాల్గొన్న ఈవెంట్ గందరగోళంగా మారిన నేపథ్యంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిపై ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరువు నష్టం దావా వేశాడు.
ఈ ఈవెంట్ నిర్వహణలో తాను మధ్యవర్తిగా వ్యవహరించానని అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ ఆఫ్ కోల్‌కతా ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా చేసిన ఆరోపణలను గంగూలీ తీవ్రంగా పరిగణించాడు. ఈ నిరాధారమైన ఆరోపణలు తన ప్రతిష్టను దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేసిన దాదా రూ. 50 కోట్ల భారీ పరువు నష్టం దావా వేశాడు. తాను ఆ ఈవెంట్‌కు కేవలం ఆహ్వానితుడిగా మాత్రమే వెళ్లానని, నిర్వహణతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. గంగూలీ తరపు లాయర్లు ఉత్తమ్ సాహాకు నోటీసులు పంపారు.
