- మహాత్మా గాంధీ పేరు మార్చడం సరికాదు: జాన్‌వేస్లీ
హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి నిర్వీర్యం చేసే కుట్రను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న నరేగా పేరును వీబీ-జీ-రామ్-జీ గా మార్చడాన్ని తప్పుబట్టారు. ఇది గాంధీని అవమానించడమేనన్నారు. ఈ స్కీమ్‌ను యథావిధిగా చట్ట రూపంలోనే ఉంచి నిధులను పెంచాలని, పేరును మార్చొద్దని డిమాండ్ చేశారు. ఆ చట్టం పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు చేస్తామని, ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో వీబీ-జీ-రామ్-జీ- బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఆ బిల్లు ప్రతులను దహనం చేశారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ.. ఎన్‌డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో గాంధీ పేరును తొలగించి, జీ-రామ్-జీ అనే సంక్షిప్త నామాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పథకానికి రాముడి పేరు అర్థం వచ్చేలా పెట్టి పేదల పొట్టగొట్టేలా నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమన్నారు.
