బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలె : ఆర్.కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలె : ఆర్.కృష్ణయ్య

బీసీలకు50 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా వీరశైవ లింగాయత్లను ఓబీసీలలో చేర్చాలన్నారు. కాచిగూడ లో నిర్వహించిన రాష్ట్ర వీరశైవ లింగాయత్ బలిజ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ డిమాండ్లపై ఈ నెల 28 న ఛలో ఢిల్లీ చేపట్టి... రెండు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు అంటే ఒక్క రోజులోనే ఆమోదిస్తున్నారు కానీ బీసీలు 75 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

లింగాయత్లను బీసీ జాబితాలో చేర్చి14 ఏళ్ళు అవుతుంది.. వెంటనే ఓబీసీ జాబితాలో చేర్చాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు, కేంద్ర విద్యాసంస్థలలోని అడ్మిషన్ లలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. దేశంలోనే మొట్టమొదటి సంఘసంస్కర్త బసవేశ్వరుడని..ఆయన బోధనలు సమాజంలో అంటరానితనాన్ని పారద్రోలాయని చెప్పారు. పాలకులు బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్నారని..రాజ్యాధికారం లేని కులాలు బానిసత్వంతో సమానమన్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే మిలిటెంట్ తరహా ఉద్యమాలను చూడాల్సివస్తోందని హెచ్చరించారు.