బీసీ రిజర్వేషన్ల కేసు గెలుస్తం..అడ్వకేట్లు వాదనలు బలంగా వినిపించారు: మహేశ్ గౌడ్

బీసీ రిజర్వేషన్ల కేసు గెలుస్తం..అడ్వకేట్లు వాదనలు బలంగా వినిపించారు: మహేశ్ గౌడ్
  • 90 శాతం సీట్లు గెలుచుకుంటామని ధీమా

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై బుధవారం హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపించారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ఈ కేసు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత గాంధీ భవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘శాస్త్రీయంగానే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశాం. ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. 

ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి యధావిధిగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో దాదాపు 90 శాతం సీట్లను గెలుచుకుంటాం. 1930 తర్వాత తెలంగాణలో కుల గణన సర్వే జరిగింది. బీసీ రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నది. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కుట్రలతో బీసీల నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తున్నరు’’అని మహేశ్ గౌడ్ మండిపడ్డారు.

42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు:  మంత్రి పొన్నం

బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లు అమలు కావడం.. దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్ప బోతున్నదని అన్నారు. తెలంగాణలోని బలహీనవర్గాల సామాజిక న్యాయం కోసం రాజకీయాలకు అతీతంగా ఈ రిజర్వేషన్లకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయాలను పక్కనపెట్టి అసెంబ్లీలో మద్దతు తెలిపినట్లుగానే ఈ కేసులో కోర్టులో కూడా బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఇంప్లీడ్ కావాలని కోరారు.

కాంగ్రెస్ ఎక్కడా వెనక్కి తగ్గదు: మంత్రి వాకిటి శ్రీహరి

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఎక్కడా వెనక్కి తగ్గదని, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కూడా తమ వాదనలు బలంగా వినిపించామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే చట్ట, న్యాయపరంగా పోరాడుతున్నామని చెప్పారు. తాము ఎవరిని ఇబ్బంది పెట్టబోమని, తమకు రావాల్సిన వాటాపై మాత్రమే కొట్లాడుతున్నామని అన్నారు.