రాజన్న సిరిసిల్ల జిల్లాలో తగ్గిన చోరీలు, పెరిగిన సైబర్ క్రైమ్

 రాజన్న సిరిసిల్ల జిల్లాలో తగ్గిన చోరీలు, పెరిగిన సైబర్ క్రైమ్
  • ఈ ఏడు జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్ 
  • గతేడాదితో పోల్చితే 14.03 శాతం తగ్గిన క్రైమ్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది క్రైమ్​రేట్ తగ్గింది. గతేడాదితో పోల్చితే 14.03 శాతం క్రైమ్ రేట్ తగ్గింది. మంగళవారం 2025 క్రైమ్ వివరాలను ఎస్పీ మహేశ్​ బి.గీతే వెల్లడించారు. గతేడాదితో పోల్చితే ఈ యేడు క్రైమ్ తగ్గి జిల్లా ప్రశాంతంగా ఉందని ఎస్పీ చెప్పారు.

పెరిగిన అత్యాచారాలు

జిల్లాలో ఈ యేడు చోరీలు, మర్డర్లు తగ్గుముఖం పట్టాయి. 2024లో 12 చోరీలు జరగగా ఈయేడు 7 చోరీలు మాత్రమే జరిగాయి. 2024లో 13 హత్యలు జరిగితే, 2025లో 11 మర్డర్లు జరిగాయని ఎస్పీ తెలిపారు. గతేడాది 24 కిడ్నాపులు జరగగా ఈ యేడు 12 కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాది 20 అత్యాచారాల కేసులు నమోదు కాగా ఈసారి 31 కేసులకు పెరిగాయి. గతేడాది 443 చీటింగ్ కేసులు నమోదు కాగా ఈ యేడు 358కి పరిమితమయ్యాయి. 

గతేడాది 89 వరకట్న వేధింపుల కేసులు నమోదు కాగా ఈసారి 63 జరిగాయి. రోడ్డు ప్రమాదాలు గతేడాది 294 జరగగా ఈసారి 253కి తగ్గాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 13.94 శాతం తగ్గాయని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు గతేడాది 73 జరిగి ఈసారి 59కు తగ్గాయి. పోక్సో కేసులు గతేడాది 53 జరిగి ఈ ఏడాది 61 కి పెరిగినట్లు ఎస్పీ తెలిపారు. 

మొబైల్స్‌‌‌‌‌‌‌‌ రికవరీలో స్టేట్‌‌‌‌‌‌‌‌లో సిరిసిల్ల టాప్ 

జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్‌‌‌‌‌‌‌‌ సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా ఈ ఏడాది 799 ఫోన్లు గుర్తించి 611 బాధితులకు పోలీసులు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్స్ రికవరీలో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల ఫస్ట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచిందని ఎస్పీ వివరించారు.

పెరిగిన సైబర్ నేరాలు

 జిల్లాలో గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు పెరిగినట్లు ఎస్పీ వివరించారు. గతేడాది 82 కేసులు నమోదైతే.. ఈసారి 114 కేసులు ఫైల్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసల్లో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఏపీ, జార్ఖండ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేశామన్నారు. జిల్లాలో ఈసారి తక్కువ కేసులు నమోదై, శాంతిభద్రతల అదుపులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీలు చంద్రయ్య, రుత్విక్ సాయి, డీఎస్పీ నాగేంద్ర చారి  పాల్గొన్నారు. 

జగిత్యాల జిల్లాలో తగ్గిన నేరాలు

జగిత్యాల టౌన్, వెలుగు: ఈ ఏడాది శాంతి భద్రతల పరిరక్షణలో జగిత్యాల పోలీసులు విశేష ఫలితాలు సాధించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఈ ఏడాది క్రైమ్‌‌‌‌‌‌‌‌ రేట్ వివరాలను వివరించారు. నేరాల నియంత్రణలో 2025లో మొత్తం నేరాలు 5.05శాతం తగ్గాయని వివరించారు. 2024లో 5,919 కేసులు నమోదవగా ఈసారి 5,620కి తగ్గాయి. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 770 కేసులు, అత్యల్పంగా బుగ్గారం స్టేషన్ పరిధిలో 135 కేసులు నమోదయ్యాయి.

 డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ వినియోగం, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. 2025లో 24.22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు పాటు 86 కేసులు నమోదు చేసి, 203 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. విద్యార్థుల్లో అవగాహన కోసం యాంటీ డ్రగ్ క్లబ్‌‌‌‌‌‌‌‌లు, మహిళల భద్రత కు షీ టీమ్స్, భరోసా సెంటర్‌‌‌‌‌‌‌‌ ద్వారా మహిళలు, బాలల రక్షణ చర్యలు, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి శాఖ జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు.

 డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ తనిఖీలు, హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రమాదాల సంఖ్య తగ్గిందని అన్నారు. 9,290 డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదు కాగా, 14 మందికి శిక్షలను విధించినట్లు చెప్పారు. 2026లో సమర్థంగా, పారదర్శకంగా సేవలందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం పోలీసు సిబ్బంది ఆరోగ్యం కోసం ఆధునిక జిమ్‌‌‌‌‌‌‌‌ను ఎస్పీ ప్రారంభించారు. సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు, ఎస్‌‌‌‌‌‌‌‌ఐలు పాల్గొన్నారు.