హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పరీక్షల నిర్వహణలో భారీ మార్పులు చేశారు. గతంలో పేపర్ల లీకేజీ భయం ఉండేది. ఇప్పుడు ప్రింటింగ్ నుంచి పరీక్ష కేంద్రానికి చేరే వరకు వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేసి ట్రాక్ చేస్తున్నారు. ప్రశ్నాపత్రం, బుక్‌లెట్ పై ప్రత్యేక కోడ్ ముద్రిస్తున్నారు. ఎక్కడ స్కాన్ అయినా వెంటనే తెలిసిపోతుంది. ఈసారి నీళ్లలో తడిసినా పాడవని బుక్‌లెట్లను విద్యార్థులకు ఇవ్వనున్నారు.
ఫీజులు కట్టినా కాలేజీ యాజమాన్యాలు బోర్డుకు కట్టకపోవడంతో చివరి నిమిషంలో హాల్ టికెట్ల కోసం విద్యార్థులు పడే ఇబ్బందులకు చెక్ పెట్టారు. ఆన్‌లైన్ మాడ్యూల్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీజుల వివరాలు అప్‌డేట్ చేస్తున్నారు. కట్టకపోతే కారణాలతో సహా ప్రిన్సిపాల్స్ ఆన్‌లైన్ లో నమోదు చేయాలి. ఈ సమాచారం వెంటనే పేరెంట్స్ కు వెళ్తుంది. అలాగే ఫస్టియర్ మార్కుల వివరాలను సెకండియర్ హాల్ టికెట్ పైనే ముద్రించనున్నారు.
