- బీజేపీతో జతకట్టేవాళ్లపై ఒక్క కేసూ పెట్టట్లే
- అధికారం కోసం ఈసీనీ వాడుకుంటున్నరు
- బెర్లిన్ టూర్లో రాహుల్ కామెంట్స్
న్యూఢిల్లీ/బెర్లిన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ రాజ్యాంగ సంస్థలను ఆయుధంగా వాడుకుంటోందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోందని, బీజేపీతో జతకట్టేవారిని మాత్రం వదిలిపెడుతోందన్నారు. ‘‘భారత్‌లో సంస్థాగత వ్యవస్థలన్నింటినీ అధికార బీజేపీ హోల్ సేల్ గా క్యాప్చర్ చేసింది.
దేశంలోని సంస్థలపై పూర్తిస్థాయిలో దాడి జరుగుతోంది. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధంగా వాడుకుంటోంది. బీజేపీ నేతలపై ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. రాజకీయ ప్రత్యర్థులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు” అని ఆయన అన్నారు. సోమవారం బెర్లిన్ లోని హెర్టీ స్కూల్ లో ‘పాలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్’ అంశంపై జరిగిన సెమినార్లో రాహుల్ గాంధీ మాట్లాడారు.
ఎవరైనా ఒక వ్యాపారవేత్త కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తే, వాళ్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలు తమ సొంతమని బీజేపీ భావిస్తోందని, రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడం కోసం వీటిని ఒక ఆయుధంగా వాడుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ సంస్థలను ఎప్పుడూ ఇలా చూడలేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
హర్యానా ఎన్నికల్లో మేమే గెలిచాం..
గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘మేం తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో గెలిచాం. భారత్‌లో ఎన్నికలు పారదర్శకంగా జరగడంలేదని ఆందోళన చెందుతున్నాం. హర్యానా ఎన్నికలపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి అక్రమాలను బయటపెట్టాను. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారతలోని ఎన్నికల వ్యవస్థలోనే సమస్య ఉందని మేం నమ్ముతున్నాం” అని రాహుల్ విమర్శించారు.
మోదీ సర్కార్ విజన్ ఫెయిల్..
దేశ ఆర్థిక విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుకు కొత్త విజన్ అంటూ ఏదీ లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ ఎకనమిక్ మోడల్‌నే ప్రస్తుత బీజేపీ అనుసరిస్తోందన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక విధానం ముగిసిందని, దానితో ఇక ఎలాంటి ఫలితాలు రావన్నారు.
విదేశాల్లో దేశం పరువు తీస్తున్నారు: బీజేపీ
బెర్లిన్‌లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై బీజేపీ మండిపడింది. విదేశాల్లో భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశం పరువు తీస్తున్నారని విమర్శించింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీకి వెళ్లారని, అక్కడ దేశానికి వ్యతిరేకంగా స్పీచ్‌లు ఇస్తున్నారని బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీని 29 దేశాలు పురస్కారాలతో గౌరవిస్తే... రాహుల్ మాత్రం విదేశాలకు వెళ్లి భారత్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు.
