ఇక ఆదివాసీల అస్తిత్వం, విశ్వాసం శాశ్వతం..భవిష్యత్ తరాల కోసం భారీ శిలలపై తల్లుల చరిత్ర

ఇక ఆదివాసీల అస్తిత్వం, విశ్వాసం శాశ్వతం..భవిష్యత్ తరాల కోసం భారీ శిలలపై తల్లుల చరిత్ర
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ములుగు/తాడ్వాయి, వెలుగు: ఆదివాసీల ఇలవేల్పులు మేడారం సమ్మక్క, సారలమ్మల చరిత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని, భవిష్యత్​ తరాల కోసం భారీ శిలలపై తల్లుల చరిత్ర చెక్కించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. కారుకూతలు కూసేటోళ్లకు ఛాన్స్​ లేకుండా నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. 


మంగళవారం మేడారంలో మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు వేం నరేందర్​రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కలెక్టర్​ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేకన్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి హరిత హోటల్ లో అధికారులు, గుత్తేదారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఆదివాసీలు, పూజారుల నమ్మకం, విశ్వాసాలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని తెలిపారు. 

మరో 15రోజుల్లో పనులు పూర్తవుతాయని, జనవరి 5లోపు గద్దెల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నాయకులందరినీ ఆహ్వానించి జాతరను ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాతో పాటు నిధులు కూడా కేటాయించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నాం: సీతక్క

సమ్మక్క సారలమ్మ చరిత్ర శాశ్వతంగా నిలిచేలా తమ ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, ఆదివాసీల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఆలయ నిర్మాణాన్ని యజ్క్షంలా ముందుకు తీసుకుపోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. తల్లుల దీవెనలతోనే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 

డిసెంబర్​ 24 న  దర్శనాలు బంద్..

మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా కొత్తగా సమ్మక్క, సారలమ్మ,గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుసగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలు రాతి కట్టడాలతో పూర్తి కావడంతో ఆ గద్దెలపై గజ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. బుధవారం పూజా కార్యక్రమాలు ఉన్నందున భక్తులకు దర్శనాలను బంద్​ చేస్తున్నట్లు చెప్పారు. గురువారం నుంచి యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని 
తెలిపారు.