- 7.30 లక్షల ఎకరాలకు సాగునీరు
- ఊపందుకోనున్న వరినాట్లు
నిజామాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. యాసంగి పంటలు కోతకు వచ్చే దాకా ఏప్రిల్ 8 వరకు వారాబందీ విధానంలో ఏడు తడులు అందించనున్నారు. 106 రోజుల పాటు రిలీజ్ చేసే తడుల కోసం 57.68 టీఎంసీలు అవసరమని లెక్క తేల్చారు.
ప్రాజెక్టు 80.501 టీఎంసీలతో పూర్తిగా నిండి ఉన్న నేపథ్యంలో 6.5 లక్షల ఎకరాలకు కావల్సిన నీటి తడులు సమృద్ధిగా ఇచ్చినా ఇంకా 22 టీఎంసీల నీరు బ్యాలెన్స్ ఉంటుందని, ఆ తరువాత వర్షాలు షురూ అవుతాయని లెక్కలు వేశారు. హైదరాబాద్‌లో ఈ నెల 3న ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన హై లెవల్ స్కీవమ్ కమిటీ మీటింగ్‌లో ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి తడులు అందించడంపై చర్చించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాలోని లిఫ్ట్‌లు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కూడా ఇందులో చేర్చారు. ప్రాజెక్టు నుంచి 183 కిలోమీటర్ల దూరంలోని ఎల్ఎండీ ఎగువ భాగంలోని డీబీఎం 23 వరకు 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. స్టేజ్ 1గా పిలిచే ఈ సాగు విస్తీర్ణం ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో
విస్తరించి ఉంది.
జోన్ల వారీగా రిలీజ్..
రిపేర్లు నడుస్తున్న ఎస్పారెస్పీ ఫ్లడ్ కెనాల్‌ను సీజన్ మొత్తం ఉపయోగించవద్దని నిర్ణయించిన ఇంజినీర్లు ఆయకట్టుకు చెందిన డి/5 నుంచి డి/94 కెనాల్స్‌ను రెండు జోన్లుగా డివైడ్ చేశారు. ఇందులో మొదటి జోన్ కెనాల్స్‌కు 24 నుంచి వారం రోజులు నీటిని రిలీజ్ చేస్తారు.
ఫస్ట్ జోన్‌లోని డి/5 కాలువ మెండోరాలో మొదలై మెట్‌పల్లిలోని డి/53 వద్ద ముగుస్తుంది. దీనికి 3,500 క్యూసెక్కులు రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత రెండో జోన్‌లోని డి/54 నుంచి డి/94 కెనాల్స్‌కు 8 రోజులు నీరు ఇస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తరించిన జోన్ కెనాల్స్ ఆయకట్టు చివరి భాగంలో ఉన్నందున ఆవిరి నష్టాలు జత చేసి రోజుకు 5,500 క్యూసెక్కులు రిలీజ్ చేయనున్నారు.
ఇలా వారాబందీ విధానంలో జోన్-1 లోని కెనాల్స్‌కు 8 రోజులు, జోన్- 2లోని కెనాల్స్‌కు మరో 8 రోజులు కలిపి సీజన్ ముగిసేంత వరకు ఏడు తడుల చొప్పున రిలీజ్ చేయడానికి ప్రిపేరయ్యారు. ఇందుకోసం కాకతీయ కాలువకు 41.43 టీఎంసీలు, సరస్వతీ కెనాల్‌కు 3.39 టీఎంసీలు, లక్ష్మీ కాలువకు 3.39 టీఎంసీలు అవసరమని ఇంజినీర్లు తేల్చారు. అలీసాగర్ లిఫ్ట్ స్కీమ్ ఆయకట్టుకు 2.29 టీఎంసీలు, గుత్పకు 1.41 టీఎంసీలు, ఇతర ఎత్తిపోతలకు 1.32 టీఎంసీలు అలాట్ చేశారు. తాగు నీటి స్కీమ్‌లకు 2.10 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 4.50 టీఎంసీలు కలిపి 57.68 టీఎంసీల నీటి అవసరం ఉంటుందని తేల్చారు.
ఇక వరి నాట్ల జోరు..
గతేడాది శ్రీరాంసాగర్ ఆయకట్టుకు డిసెంబర్ 25న మొదటి తడి అందించారు. ఈసారి ఒక రోజు ముందే ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో చెరువులు నిండడంతో పాటు గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు సమృద్ధిగా పోస్తున్నాయి. ఇప్పుడు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కూడా నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలో వరి నాట్ల జోరు పెరగనుంది.
