మళ్లీ పాత పాటే!..కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లు చేయబోమన్న ఏజెన్సీలు

మళ్లీ పాత పాటే!..కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లు చేయబోమన్న ఏజెన్సీలు
  •     తమ పనులు అప్పుడే పూర్తయ్యాయని వాదన
  •     ఏజెన్సీలపై మంత్రి ఉత్తమ్ సీరియస్?
  •     పనులు ఎలా చేయించుకోవాలో తమకు తెలుసంటూ వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల ఏజెన్సీలు మళ్లీ పాతపాటే అందుకున్నాయి. బ్యారేజీలకు రిపేర్లు చేయబోమని తేల్చి చెప్పాయి. తమ పనులు అప్పుడే పూర్తయిపోయాయని, బ్యారేజీలు డ్యామేజ్ అయ్యే నాటికి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కూడా పూర్తయిపోయిందని ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. దీంతో బ్యారేజీల ఏజెన్సీల ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సంబంధించి మంగళవారం సెక్రటేరియెట్​లో పుణేకి చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీడబ్ల్యూపీఆర్ఎస్ నుంచి మోడల్ స్టడీస్, జియోటెక్నికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ నిపుణులు ఐదారుగురు, బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బ్యారేజీల వద్ద చేయాల్సిన టెస్టులు, పునరుద్ధరణ పనులు, రిపేర్లపై చర్చించారు. అయితే, సమావేశానికి రెండు సంస్థల నుంచి మిడిల్ లెవెల్ మేనేజర్లు హాజరైనట్టు తెలిసింది. దీనిపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇంత కీలకమైన విషయంపై సమావేశం జరుగుతున్నప్పుడు కంపెనీలకు చెందిన ముఖ్యమైన అధికారులు రాకపోవడమేంటని సదరు సంస్థలపై మండిపడినట్టు సమాచారం. 

పైగా రిపేర్లు తమ బాధ్యత కాదని కంపెనీలు చెప్పడంతో మంత్రి ఉత్తమ్ మరింత ఆగ్రహానికి గురైనట్టు తెలిసింది. ఏయే కంపెనీ ఎలాంటి పనులు చేసిందో తమకంతా తెలుసని, మీతో పనులు ఎలా చేయించాలో కూడా తమకు తెలుసని హెచ్చరించినట్టు సమాచారం. రిపేర్లు చేయబోమంటే చట్టపరంగానే సమాధానమిస్తామని వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. 

ముందు సుందిళ్ల నుంచి..

మూడు బ్యారేజీల్లో తొలుత సుందిళ్ల నుంచి పనులు మొదలు పెట్టాలని సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులకు మంత్రి ఉత్తమ్ సూచించినట్టు సమాచారం. సుందిళ్లతో పాటు అన్నారం బ్యారేజీల వద్ద టెస్టులు నిర్వహించి ఎలా ముందుకెళ్లాలో చెప్పాలని నిపుణులకు సూచించినట్టు సమాచారం. 

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం.. సుందిళ్లకు లింక్ చేసి ఎల్లంపల్లికి తరలించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చిన నేపథ్యంలోనే సుందిళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలిసింది. పైగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చేయాల్సిన రిపేర్లు తక్కువగా ఉండడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

ఆయా బ్యారేజీల్లో సీపేజీలను క్లియర్ చేయడం, సీసీ బ్లాకుల నిర్మాణం, షూటింగ్ వెలోసిటీస్ తగ్గించే ఏర్పాట్లు, ఆప్రాన్ల రిపేర్ల వంటి పనులే చేపట్టాల్సి ఉండడంతో అక్కడే ముందు టెస్టులు చేసి రిపేర్లను పూర్తిచేస్తే త్వరగా వాటిని వాడుకలోకి తీసుకొచ్చేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వీటికి ఓ పది పదిహేను రోజుల్లోనే టెస్టులు పూర్తి చేసే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత మేడిగడ్డ వద్ద టెస్టులు చేస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. 

తొలుత బ్యారేజీల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు ప్రభుత్వానికి చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయో తెలియదని, అవి తెలుసుకున్నాక టెస్టుల షెడ్యూల్ ఇస్తామని చెప్పినట్టు సమాచారం. బుధవారం బ్యారేజీలను పరిశీలిస్తామని వాళ్లు చెప్పినట్టు తెలిసింది. అనంతరం జనవరి తొలి వారంలో అక్కడ టెస్టులు ప్రారంభించే అవకాశాలున్నాయి.